YSRCP కి దేవినేని కొత్త నిర్వచనం.. వై అంటే వైవీ, ఎస్ అంటే సాయిరెడ్డి.. ఆర్ అంటే..

కొల్లు రవీంద్ర పేరును కుట్రపూరితంగానే మచిలీపట్నం హత్యకేసులో చేర్చారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు.

news18-telugu
Updated: July 3, 2020, 6:40 PM IST
YSRCP కి దేవినేని కొత్త నిర్వచనం.. వై అంటే వైవీ, ఎస్ అంటే సాయిరెడ్డి.. ఆర్ అంటే..
దేవినేని ఉమ (ఫైల్ ఫొటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వై అంటే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అని, ఎస్ అంటే పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అని, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ కొత్త నిర్వచనం చెప్పారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఈ ముగ్గురునీ దోచుకోమని చెప్పి జగన్ రాష్ట్రంపైకి వదిలేశారని మండిపడ్డారు. 13 జిల్లాల్లో ల్యాండ్, శాండ్, మైనింగ్, వైన్స్ మాఫియాల తర్వాత ఇళ్లస్థలాల ముసుగులో నేలచదును పేరుతో, కోట్లాదిరూపాయలు దండుకుంటున్నారని దేవినేని మండిపడ్డారు. చంద్రబాబునాయుడిని ఎలా తిట్టాలి, టీడీపీ వారిపై ఏం కేసులు పెట్టాలన్న కృతనిశ్చయంతోనే సజ్జల తాడేపల్లి రాజప్రాసాదంలో కూర్చొని పనిచేస్తున్నారన్నారు. నేతిబీరలో నెయ్యి ఎంతుంటుందో, వైసీపీలో సామాజిక న్యాయం కూడా అలానే ఉంటుందన్నారు. లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ అవినీతిపై ఎర్రన్నాయుడు, అశోక్ గజపతి రాజు కేసులు వేశారని, నేడు వారి కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.

కొల్లు రవీంద్ర పేరును కుట్రపూరితంగానే మచిలీపట్నం హత్యకేసులో చేర్చారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతి ఉద్యమం 200రోజులకు చేరిందని, రైతులు, రైతుకూలీలు, మహిళలు ప్రభుత్వ వేధింపులను తట్టుకొని ఉద్యమంలో నిలిచారన్నారు. ఉద్యమానికి సంఘీభావంగా టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం కొల్లు రవీంద్ర పేరును హత్యకేసులో తెరపైకి తీసుకొచ్చిందన్నారు.

అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ కోర్టులో ఉండగానే ఆయన్ని బలవంతగా డిశ్చార్జి చేసి, విజయవాడ సబ్ జైలుకు తరలించారని, ఆయన ఆరోగ్యం బాగోలేకపోయినా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. సజ్జల నిర్దేశకత్వంలోనే ఇదంతా జరిగిందని దేవినేని చెప్పారు. విశాఖలో అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు పెట్టారని, విజయనగరంలో అశోక్ గజపతి రాజు కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తూర్పుగోదావరిలో యనమల రామకృష్ణుడు, చినరాజప్పలపై, పితాని సత్యనారాయణపై తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. కృష్ణాజిల్లాలో కొల్లు రవీంద్రను హత్యకేసులో నిందితుడిగా ఇరికించాలని చూస్తున్నారన్నారు. మచిలీపట్నంలో జరిగిన హత్య పాతకక్షల వల్ల జరిగిందని తెలిసికూడా రవీంద్రను ఇరికించాలని చూడటం న్యాయం కాదన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ, టీడీపీలోని బలమైన నేతలపై పథకం ప్రకారమే ప్రభుత్వం కేసులుపెడుతోందన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 3, 2020, 6:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading