news18-telugu
Updated: November 8, 2019, 5:24 PM IST
మహారాష్ట్ర గవర్నర్ను కలసి తన రాజీనామాను అందజేస్తున్న ఫడ్నవీస్ (File)
మహారాష్ట్ర తాత్కాలిక ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ కొనసాగనున్నారు. తన పదవీకాలం ముగిసిపోవడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో ఫడ్నవీస్ రాజీనామా చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలసి తన రాజీనామాను సమర్పించారు. ఫడ్నవీస్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరినట్టు ఫడ్నవీస్ తెలిపారు. ‘రాష్ట్రంలో పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పాటయితే రైతుల సమస్యలు పరిష్కరించవచ్చు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ నన్ను కోరారు. ప్రజల తీర్పును అగౌరవ పరచకూడదు. మళ్లీ వారిపై ఎన్నికలు రుద్దడం సరికాదు.’ అని ఫడ్నవీస్ అన్నారు.
శివసేన మాట వినకపోవడంతో ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఫడ్నవీస్ ఖండించారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయాల్సిన అవసరం తమకు లేదని, బీజేపీ అలాంటి పనులు చేయదన్నారు. ఆరోపణలు చేసేవారు వాటిని రుజువు చేయాలని డిమాండ్ చేశారు.
శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే అంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. కానీ, ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలు మాత్రం అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా గత పది రోజుల్లో ఏకంగా ప్రధాని మోదీ మీద కూడా వారు చేసిన వ్యాఖ్యలు అవమానించేలా ఉన్నాయన్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 8, 2019, 5:24 PM IST