మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా...

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన తర్వాత రెండు గంటల్లోనే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.

news18-telugu
Updated: November 26, 2019, 5:54 PM IST
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా...
దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర (3 రోజులు. 2019 నవంబర్ 23-26 వరకు)
  • Share this:
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన తర్వాత రెండు గంటల్లోనే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన రాజీనామాను దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మెజారిటీ ఇచ్చారని, అయితే, శివసేన బీజేపీని మోసం చేసిందని ఫడ్నవీస్ ఆరోపించారు. శివసేన పార్టీ ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా వ్యవహరించిందన్నారు. పరస్పర విరుద్ధ అభిప్రాయాలు కలిగిన కాంగ్రెస్ - ఎన్సీపీ - శివసేన కలసి.. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీని అధికారానికి దూరం చేయడమే ఆ మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణ అని మండిపడ్డారు. అజిత్ పవార్ ఎన్సీపీ శాసనసభాపక్ష నేత కావడంతో ఆయనతో తాము చర్చలు జరిపామని ఫడ్నవీస్ చెప్పారు. ఆయన మద్దతు ఇస్తామనడంతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

బీజేపీ సీఎం ఎవరైనా తమకు అభ్యంతరం లేదని.. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో శివసేన చెప్పిందని ఫడ్నవీస్ తెలిపారు. ఒక్కసారి కూడా మాతోశ్రీ (థాక్రే నివాసం) మెట్లు ఎక్కని వారితో కలసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గడప గడపకూ తిరుగుతోందని విమర్శించారు. తమకు పార్టీలను చీల్చడం, ఎమ్మెల్యేలను కొనడం ఇష్టం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలన వద్దని, ప్రభుత్వాన్న ఏర్పాటు చేద్దామని అజిత్ పవార్ తమకు తెలపడం వల్లే ముందడుగు వేశామన్నారు.

మహారాాష్ట్ర గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించిన ఫడ్నవీస్


దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఈనెల 23వ తేదీ శనివారం రోజు ప్రమాణస్వీకారం చేశారు. ఆ రోజు తెల్లవారుఝామున 5.43 గంటలకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. ఆ వెంటనే ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. దీనిపై ఎన్సీపీ - కాంగ్రెస్ - శివసేన కలసి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీజేపీకి మెజారిటీ లేదని సుప్రీంకోర్టు‌లో పిటిషన్ వేశాయి. దీని మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈనెల 27వ తేదీ సాయంత్రం లోపు ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించింది. ఈ కార్యక్రమం మొత్త లైవ్ టెలికాస్ట్ చేయాలని, ఎలాంటి రహస్య ఓటింగ్ నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే అజిత్ పవార్ రాజీనామా చేయడం విశేషం. ప్రభుత్వానికి సరైన సంఖ్యాబలం కూడగట్టడంలో విఫలం అయినందువల్లే అజిత్ పవార్ రాజీనామా చేసినట్టు తెలిసింది.

First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>