అవినీతిని అరికట్టాల్సిన ఏసీబీ అధికారులే అవినీతి పనులకు పాల్పడుతున్నారు.లంచాలకు ఆశపడి అధికారులను అవినీతి కేసుల్లో బుక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లా మధురవాడలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఇటీవల మధురవాడ సబ్ రిజిస్ట్రార్ తారకేష్‌ను బుక్ చేసేందుకు ఏసీబీ అధికారులు విఫలయత్నం చేశారు. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో తనిఖీల సందర్భంగా.. అక్కడ డబ్బు దొరక్కపోవడంతో.. ఏసీబీ అధికారులే
రూ.61,500 తీసుకెళ్లి అక్కడ పెట్టారు. తప్పుడు సాక్ష్యం చెప్పేందుకు కొంతమంది మధ్యవర్తులను కూడా తీసుకొచ్చారు. అయితే తప్పుడు సాక్ష్యం చెప్పేందుకు వారు నిరాకరించారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ దృష్టికి తీసుకెళ్లారు. దానికి సంబంధించి సీసీటీవి ఫుటేజీ ఆధారాలను కూడా ఆయనకు అందించారు. దీంతో ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బోస్.. వారిపై కేసులకు ఆదేశించారు.
అవినీతి అధికారులపై ఎలాంటి కేసులు పెడుతారో.. వారిపై కూడా అలాంటి కేసులే పెట్టాలని ఆదేశించారు.ఏసీబీ అధికారుల పనితీరు చూస్తే అసహ్యం వేస్తోందని.. అవినీతిని అరికట్టాల్సినవారే అవినీతికి పాల్పడటం దారుణమని అన్నారు. కేసు గురించి డీజీపీ,హోంమంత్రితో మాట్లాడానని.. పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నందునా.. దీనిపై విచారణే అవసరం లేదని అన్నారు. అవినీతికి పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయాలన్నారు.లంచాలు ఇవ్వని అధికారులపై తప్పుడు కేసులు పెట్టి బనాయిస్తారా? అని మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.