లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుపై కాంగ్రెస్ మరికాసేపట్లో క్లారిటీ ఇవ్వనుంది. దీనిపై చర్చించేందుకు పార్టీ సీనియర్ నేతలు, ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో ఢిల్లీలో పొత్తుపై చర్చించేందుకు రాహుల్ గాంధీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ షీలా దీక్షిత్, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, పీ.చిదంబరం, అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, మీరా కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.