చంద్రబాబు, జగన్‌కు ఝలక్.. పోలవరంపై విచారణకు హైకోర్టు ఆదేశం..

పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ పెంటపాటి పుల్లారావు అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌ను ఫిర్యాదుగా భావించాలని కోర్టు సూచించింది.

news18-telugu
Updated: October 9, 2019, 4:32 PM IST
చంద్రబాబు, జగన్‌కు ఝలక్.. పోలవరంపై విచారణకు హైకోర్టు ఆదేశం..
పోలవరం ప్రాజెక్టు
  • Share this:
పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే ఆరోపణలతో దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ప్రాజెక్టు మీద విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ పెంటపాటి పుల్లారావు అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పోలవరంపై విచారణ జరపాలని కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించింది. పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌ను ఫిర్యాదుగా భావించాలని సూచించింది. పోలవరంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని అమరావతిలో ప్రకటనలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో మాత్రం దానిపై ఎందుకు మాట్లాడడం లేదని పిటిషనర్ పెంటపాటి పుల్లారావు ప్రశ్నించారు. దీంతోపాటు మార్చిలో ఎన్నికల ప్రచారానికి గుంటూరు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్వయంగా పోలవరాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారని అప్పటి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించిన విషయాన్ని పుల్లారావు హైలైట్ చేస్తున్నారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి ఆరోపణలు చేసినా కూడా ఇంతవరకు దానిపై విచారణ జరగలేదన్నారు.

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16వేల కోట్ల నుంచి రూ.50వేల కోట్లకు పెంచడం వెనుక పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందని పుల్లారావు ఆరోపిస్తున్నారు. పోలవరం ముంపు బాధితులకు ఎకరాకు రూ.40వేల నుంచి రూ.50వేల చొప్పున ఇచ్చేసి... ఆ భూములను కొందరు కొన్నారని, వారికి ఎకరాకు రూ.40 లక్షల వరకు ఇచ్చేందుకే ప్రాజెక్టు అంచనాలను పెంచారని ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న అధికారులే, వైసీపీ ప్రభుత్వంలో కూడా అక్కడే ఉండి పోలవరంపై అవినీతిని బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని పుల్లారావు అనుమానం వ్యక్తం చేశారు. పోలవరంలో అవినీతిపై విచారణ జరిపించాలంటూ గతంలో తాము సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ,ప్రధాని కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఆదేశంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు పనులు కొంతమేర జరిగాయి. పోలవరం ముంపు బాధితులకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం వల్ల పరిహారం ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుందంటూ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని అప్పటి చంద్రబాబునాయుడి ప్రభుత్వం పెంచింది. అయితే, అందులో భారీగా అవినీతి జరిగిందని అప్పటి ప్రతిపక్షం వైసీపీ ఆరోపించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత కాంట్రాక్టర్‌ను తప్పించి, కొత్తగా రివర్స్ టెండరింగ్ పేరుతో తక్కువ ధరకు కొటేషన్ ఇచ్చిన వారికి ప్రాజెక్టు అప్పగించారు. ఈ రకంగా సుమారు రూ.750 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మిగులుతుందని చెప్పారు. పోలవరంలో అవినీతి జరిగినందుకే తాము ఇలా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఎంత అవినీతి జరిగింది? ఎక్కడెక్కడ జరిగిందనే వివరాలను మాత్రం ప్రభుత్వం బయటపెట్టలేదు. తాజాగా, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడంతో కేంద్రం పోలవరం ప్రాజెక్టు మీద విచారణ జరపక తప్పని పరిస్థితి తలెత్తింది. దీంతో పోలవరంలో ఎప్పుడేం జరిగిందనే వివరాలు మొత్తం బయటకు రానున్నాయి.

Viral Video: దారినపోయే వ్యక్తిని తొక్కి చంపబోయిన ఆవు..


First published: October 9, 2019, 4:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading