పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 10 గం.లకు ప్రారంభమయ్యింది. ముందుగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టి, ఆ తర్వాత ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. కౌంటింగ్ ప్రారంభించిన గంట వ్యవధిలో ట్రెండ్స్ తెలుస్తాయి. రెండు గంటల వ్యవధిలోనే అధికారం ఎవరిదో క్లారిటీ రానుంది. ప్రారంభ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో అర్వింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉన్నారు. అర్వింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొడతారన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? రాసిపెట్టుకోండి మేమే అధికారంలోకి వస్తామన్న కమలనాథుల ఆశలు నెరవేరుతాయా? ఢిల్లీలో అధికార పీఠాన్ని ఎవరు హస్తగతం చేసుకోబోతున్నారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఇవాళ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్‌కు సంబంధించి మొత్తం 21 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఢిల్ల్లీ పోలీసులే కాకుండా, పారామిలిటరీ దళాలతో భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల బరిలో మొత్తం 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 58 జనరల్, 12 ఎస్సీ అభ్యర్థులకు కేటాయించారు. ఇక సీఎం కేజ్రీవాల్ పోటిచేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి 26 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ నెల 11న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఓటింగ్ ముగిసిన తర్వాత పలు జాతీయ వార్తా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేశాయి. అందులో మెజారిటీ సర్వేలు ఆప్కే జై కొట్టాయి.2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించింది. బీజేపీ మూడు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. గతంలో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి కూడా ఖాతా తెరవడం అనుమానమేనని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
Published by:Sulthana Begum Shaik
First published:February 11, 2020, 08:24 IST