‘తాజ్ మహల్‌ని కూడా అమ్మేస్తారేమో’...రాహుల్ గాంధీ

Delhi Assembly Elections 2020 | కీలకమైన నిరుద్యోగ సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఇద్దరూ పట్టించుకోవడం లేదని కాంగ్రస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

news18-telugu
Updated: February 4, 2020, 9:31 PM IST
‘తాజ్ మహల్‌ని కూడా అమ్మేస్తారేమో’...రాహుల్ గాంధీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ
  • Share this:
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం శ్రీకారం చుట్టారు. దక్షిణ ఢిల్లీలోని జంగ్‌పురాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ...బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలపై విరుచుకపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీలు నిరుద్యోగ సమస్యను పెంచుతున్నాయంటూ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. దేశంలో యువత ఎదుర్కొంటున్న కీలక నిరుద్యోగ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీ నోరుమెదపడం లేదని విమర్శించారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశాలు సిద్ధంగా ఉన్నా...ఈ దిశగా ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చొరవచూపడం లేదని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ...తన హామీని నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. ఉద్యోగ కల్పనపై కేజ్రీవాల్ కూడా తన హామీని నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు.

మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న జీఎస్టీ ద్వారా ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తమ అధికారం కోసం ప్రజల మధ్య కొట్లాటలు పెట్టడమే మోదీ, కేజ్రీవాల్‌కు తెలుసని...నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం తెలీదని విమర్శించారు.


‘మేడ్ ఇన్ ఇండియా’ నినాదాన్ని వల్లించిన ప్రధాని మోదీ...దేశంలో ఒక్క పరిశ్రమైనా నెలకొల్పారా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. చైనా మినహా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇటలీ తదితర అన్ని దేశాలు భారత్‌లో పరిశ్రమలు నెలకొల్పేందుకు సుముఖంగా ఉన్నాయని చెప్పారు. అయితే చైనాకు ప్రత్యామ్నాయంగా దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు మోదీ సర్కారు చొరవ చూపడం లేదన్నారు. గత ఐదేళ్లుగా దేశంలో ద్వేషం, హింస, అత్యాచారాలు, హత్యలు రాజ్యమేలుతున్నాయంటూ ధ్వజమెత్తారు.ఇండియన్ ఆయిన్, ఎయిరిండియా,ఎల్ఐసీ, హిందుస్థాన్ పెట్రోలియం, రైల్వేస్, ఎర్రకోట ఇలా అన్నిటినీ మోదీ సర్కారు విక్రయానికి పెడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. వారు తాజ్ మహల్‌ను కూడా అమ్మేస్తారేమోనంటూ ధ్వజమెత్తారు.

First published: February 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు