డేటా చోరీ కేసులో చంద్రబాబు సర్కార్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు..

ఏపీలో సంక్షేమ పథకాల లబ్దిదారుల డేటా చౌర్యం కేసులో ఏపీ ప్రభుత్వం చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఐటీ గ్రిడ్ సంస్ధకు చెందిన నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. ఎండీ అశోక్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అశోక్‌కు ఏపీ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తుండవచ్చని భావిస్తున్న సైబరాబాద్ పోలీసులు... కోర్టు ఉత్తర్వులతో ఏపీలోనూ గాలింపుకు సిద్ధమవుతున్నారు.

news18-telugu
Updated: March 5, 2019, 8:11 AM IST
డేటా చోరీ కేసులో చంద్రబాబు సర్కార్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు..
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
(సయ్యద్ అహ్మద్
అమరావతి కరస్పాండెంట్, న్యూస్18)

ఏపీ ఓటర్ల డేటా చౌర్యం వ్యవహారం చంద్రబాబు సర్కారు మెడకు చుట్టుకుంటోంది. ఏపీ సర్వర్ల నుంచి డేటాను అనధికారికంగా డౌన్ లోడ్ చేసుకుని సేవా మిత్ర యాప్ కోసం వాడుకుంటున్న టీడీపీ.. సైబరాబాద్ పోలీసుల తాజా విచారణతో ఇరుకునపడింది. సేవామిత్ర యాప్ నిర్వహణ కోసం టీడీపీకి సన్నిహితంగా ఉండే దాకవరపు అశోక్ అనే వ్యక్తి నెలకొల్పిన ఐటీ గ్రిడ్స్ సంస్ధ వ్యవహారంపై ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. వీరిని అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్ధ ఉద్యోగులు కనిపించడం లేదంటూ కౌంటర్ కేసు పెట్టించినా హైకోర్టులో వారు తమనెవరూ నిర్బంధించలేదని చెప్పడంతో కేసు తేలిపోయింది.

అదే సమయంలో డేటా చౌర్యం కేసు విచారణపై హైకోర్టు కూడా అడ్డుచెప్పకపోవడంతో తదుపరి చర్యలకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.ఇప్పటికే ఐటీ గ్రిడ్స్ సంస్ధ డేటాను డౌన్ లోడ్ చేసుకున్న హార్డ్ డిస్క్‌లను ఇతర కంప్యూటర్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పరీక్షల కోసం ఎఫ్ఎస్ఎల్‌కు పంపారు. ఈ హార్డ్ డిస్క్ లలో డేటా బయటపడితే ఏపీ ప్రభుత్వానికి చిక్కులు తప్పవని సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు.


లబ్ది దారుల డేటాను వారికి తెలియకుండా చౌర్యం చేయడం, సున్నితమైన సమాచారాన్ని ప్రైవేటు సంస్ధలకు అప్పగించడం వంటి నేరాలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బాధ్యులను అరెస్టు చేసేందుకు క్రైమ్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఐటీ గ్రిడ్ ఎండీ దాకవరపు అశోక్ ను ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సైబరాబాద్ పోలీసులు... ఆయన్ను రెండు రోజుల్లో స్వచ్ఛందంగా తమ ఎదుట లొంగిపోవాలని కోరారు. లేకపోతే కోర్టు ఉత్తర్వులతో ఏపీకి వెళ్లి మరీ అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారు.

ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ దొరికితే మరిన్ని వివరాలు సేకరించాలని భావిస్తున్న పోలీసులు, ఎఫ్ఎస్ఎల్ సమాచారం, అమెజాన్ సర్వల్లో స్టోర్ అయిన సేవా మిత్ర యాప్ సమాచారం కూడా వచ్చాక మొత్తం డేటాను క్రోడీకరించి లబ్ది దారుల డేటా ఆధారంగా ఓట్ల తొలగింపు జరిగిందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించనున్నారు. అదే సమయంలో ఎన్నికల సంఘానికీ, ఆధార్ అధికారులకూ ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకూ సిద్ధమవుతున్నారు. ఎన్నికల సంఘం, ఆధార్ సంస్ధ స్వతంత్రంగా దర్యాప్తు చేసేలా తగు వివరాలు అందించేందుకు కూడా సైబరాబాద్ పోలీసులు సమాచారాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
First published: March 5, 2019, 8:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading