DASARI SRINIVASULU IS TIRUPATI LOKSABHA BY POLL BJP CANDIDATE GNT NGS
Andhra Pradesh: బీజేపీ దూకుడు.. తిరుపతి అభ్యర్థి ఆయనేనా?.. తెరపైకి రిటైర్డ్ ఐఏఎస్ పేరు.. ఎవరీయన?
దాసరి శ్రీనివాసులు
తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎవరన్నది క్లారిటీ వచ్చిందా? ఇప్పటికే అధిష్టానం మాజీ ఐ.ఎ.ఎస్ పేరును ఖరారు చేసిందా? చివరిలో ఏమైనా ట్విస్టులు లేకుంటే ఆయన పేరు ప్రకటించడం లాంఛనమేనా? ప్రస్తుతం బీజేపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఇదే.
తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరు అన్నదానిపై బీజేపీకి క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి పలువురి పేర్లను వడబోసిన బీజేపీ అధిష్టానం చివరికి అభ్యర్థిని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా పేరు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ సీటు గురించి భారీగానే ఆశావాహులు కనిపించారు. ముఖ్యంగా రేసులో పలువురు రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ లు ఉండడంతో ఎవరకి అధిష్టానం అవకాశం ఇస్తుంది అన్నదానిపై ఆసక్తి పెరిగింది.
శుక్రవారం వరకు తిరుపతి బరిలో నిలిచేది జనసేన అభ్యర్థా? బీజేపీ అభ్యర్థా అన్నదానిపై ఉత్కంఠ ఉండేది. జనసేన అధినేత పవన్ తో భేటీ అయిన బీజేపీ పెద్దలు.. ఆయన్ను ఒప్పించి బీజేపీ అభ్యర్ధిని నిలబెడుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి ఆశావాహులంతా తమకే సీటు ఇవ్వాలంటూ అధిష్టానం చుట్టూ క్యూ కట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ కొందరు ఆ ప్రయత్నాల్లో బిజీగానే ఉన్నట్టు సమాచారం.
అలా ఆశావాహులైన పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లను పరిశీలించిన బీజేపీ తుది లిస్ట్‌ను తయారు చేసింది. దీనిపై అధికారికంగా క్లారిటీ ఇవ్వకపోయినా.. ఇప్పటికే ఆ అభ్యర్థికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేసిన దాసరి శ్రీనివాసులు చాలా రోజుల కిందటే బీజేపీలో చేరారు. ఆయన పేరు తిరుపతి బైపోల్స్ ప్రకటించక ముందు నుండీ బలంగా వినిపిస్తూ వస్తోంది. ఆయన కూడా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.
దాసరి శ్రీనివాసులతో పాటు బీజేపీ ఎస్సీ మోర్చాలో ఉన్న ఆలిండియా సర్వీస్ మాజీ అధికారి ఇసుక సునీల్ కుమార్ సైతం తిరుపతి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మాజీ మంత్రి రావెల కిశోర్ సైతం పోటీకి నేను సైతం అని పార్టీ పెద్దల దగ్గర చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం మాత్రం మాజీ ఐ.ఎ.ఎస్ దాసరి శ్రీనివాసులు పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. చివరిలో ఏమైనా ట్విస్టులు లేకుంటే ఆయన పేరు ప్రకటించడం లాంఛనమే అని బీజేపీ సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది..
తిరుపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి బీజేపీ మరో సెల్ఫ్ గోల్ చేసిందని సీపీఐ నేతలు విమర్శిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేయడంతో రాష్ట్రంలో ప్రజా తీర్పునకు అవకాశం ఏర్పడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగానికి ప్రజల దగ్గరకు వప్తారని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నందుకా? లేదా ప్రత్యేక హోదా హామీ నెరవేర్చనందుకా? అంటూ సీపీఐ రామకృష్ణ ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన తప్పుకొని బీజేపీని ఊబిలోకి తోసిందని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లి.. జనసేన అభ్యర్థిని నిలబెట్టినా ఓట్లు రావని పవన్ కళ్యాణ్ గుర్తించారని.. అందుకే ఆయన ఈ తమ అభ్యర్థిని కాదని.. బీజేపీ అభ్యర్థిని నిలబెట్టేందుకు అవకాశం ఇచ్చారని ఆయన అభిప్రాయ పడ్డారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.