AP Politics: దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని మళ్లీ టీడీపీలోకి తీసుకొచ్చేందుకే బాలకృష్ణ ఈ రకంగా తన సంక్రాంతిని ప్లాన్ చేసుకున్నారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి.
కొద్దిరోజుల క్రితం సంక్రాంతి పండగను తన బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సొంత ఊరు అయిన కారంచేడులో జరుపుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ. గతంలో సంక్రాంతిని చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో జరుపుకునే బాలకృష్ణ.. ఈసారి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంట్లో జరుపుకోవడంపై పెద్ద చర్చ జరిగింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని మళ్లీ టీడీపీలోకి తీసుకొచ్చేందుకే బాలకృష్ణ ఈ రకంగా తన సంక్రాంతిని ప్లాన్ చేసుకున్నారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇద్దరి బావల మధ్య సఖ్యత కోసం బాలకృష్ణ రాయబారం నడుపుతున్నారనే వార్తలు కూడా ఏపీలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ విషయంలో బాలకృష్ణ ఎంతవరకు సక్సెస్ అయ్యారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. దగ్గుబాటి ఫ్యామిలీ కొంతకాలంగా ఎన్నికల్లో విజయం సాధించలేకపోతోంది. గత ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇక బీజేపీ తరపున పోటీ చేసిన పురంధేశ్వరి కూడా ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. వైసీపీకి దాదాపుగా దూరమయ్యారు. అయితే పురంధేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగుతున్నారు. ఇక తమ కుమారుడు హితేష్ చెంచురామ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని దగ్గుబాటి దంపతులు భావిస్తున్నారు. ఇందుకోసం గత ఎన్నికల్లోనూ ప్రయత్నాలు చేశారు.
అయితే హితేష్ పౌరసత్వం వ్యవహారంలో ఇబ్బందులు రావడంతో.. అప్పట్లో పర్చూరు నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది. లేకపోతే వైసీపీ తరపున హితేష్ ఎన్నికల్లో పోటీ చేసి ఉండేవారు. అయితే ఇప్పుడు ఇందుకోసం బాలకృష్ణ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. టీడీపీ తరపున హితేష్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించే బాధ్యతను తీసుకునేందుకు బాలకృష్ణ సిద్ధమయ్యారని సమాచారం. అయితే విషయంలో మాత్రం దగ్గుబాటి ఫ్యామిలీ లెక్కలు వేరుగా ఉన్నాయని తెలుస్తోంది.
AP News: సీఎం జగన్ మరోసారి ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారా ?.. అందుకే సైలెంట్ అయిపోయారా ?
హితేష్‌కు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్‌తో పాటు పురంధేశ్వరికి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలని దగ్గుబాటి ఫ్యామిలీ టీడీపీ ముందు ప్రతిపాదన పెట్టినట్టు ప్రచారం సాగుతోంది. పురంధేశ్వరి క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గట్టిగా కోరుకుంటున్నారు. దగ్గుబాటి ఫ్యామిలీ బాలకృష్ణ ముందు పెట్టిన ఈ రెండు కండీషన్లను ఆయన టీడీపీ నాయకత్వం ముందు ఉంచారని.. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఏపీ రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు దుకు టీడీపీ నాయకత్వం నుంచి సానుకూలత వస్తే.. దగ్గుబాటి ఫ్యామిలీ మళ్లీ టీడీపీకి దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మొత్తానికి దగ్గుబాటి ఫ్యామిలీని మళ్లీ టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న బాలకృష్ణ.. ఈ క్రమంలో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.