Badvel Bypoll : కాంగ్రెస్ అభ్యర్థికి అనూహ్య మద్దతు -జాతీయ రాజకీయాలపైనా ఎఫెక్ట్ -చంద్రబాబు ఢిల్లీ టూర్‌తో లింకు?

బద్వేల్ ఉప ఎన్నిక

కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప పోరులో కాంగ్రెస్ పార్టీకి అనూహ్య మద్దతు లభించింది. ఏపీలో చోటుచేసుకున్న ఈ పరిణామం జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ రిఫ్లెక్ట్ కానుందనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు, బద్వేల్ బైపోల్ కు కూడా లింకుందనే ప్రచారం సాగుతోంది..

  • Share this:
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబందించి ఆసక్తికర అప్ డేట్ వెలువడింది. మరో ఐదు రోజుల్లో (అక్టోబర్ 30న) పోలింగ్ జరుగనుండగా, ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) స్పష్టం చేసింది. బద్వేల్ సెగ్మెంట్ లోని సీపీఐ శ్రేణులంతా కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మను సమర్థిస్తారని ఆ పార్టీ తెలిపింది.

బద్వేల్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్దతు విషయాన్ని ఆ పార్టీ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. బద్వేల్ లో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని, ఢిల్లీలో అన్ని విషయాల్లోనూ బీజేపీకి వైసీపీ మద్దతు ఇస్తుండగా, బద్వేల్ లో మాత్రం పరస్పరం పోటీలో ఉన్నాయని, తద్వారా ఆ రెండు పార్టీలది దోబూచులాట అని స్పష్టమైపోయిందని రామకృష్ణ అన్నారు.

కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతులు, కార్మికులు, ప్రజల పాలిట కంటక విధానాలు అవలంభిస్తున్నదని, ఏపీలో జగన్ సర్కారు సైతం అనాలోచిత, నిరంకుశ ధోరణిని అవలంభిస్తున్నదని, ఆ రెండు పార్టీలకు కలిపి బుద్ది చెప్పాలనే సీపీఐ.. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నదని రామకృష్ణ వివరించారు. బద్వేల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

బద్వేల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని సమర్థించాలనే సీపీఐ నిర్ణయం అటు జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమైంది. మోదీ వ్యతిరేక పోరులో ముందు నుంచీ కాంగ్రెస్ తో కలిసి ప్రయాణిస్తోన్న సీపీఐ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకోబోతున్నామనే సంకేతాలను బద్వేల్ నుంచి ఇచ్చినట్లయింది. మరోవైపు, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు, బద్వేల్ ఉప పోరుకూ లింకులున్నాయనే ప్రచారం సాగుతోంది. జగన్ సర్కారుపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. కేంద్రం పెద్దలతో సంభాషణలో ‘బద్వేల్ లో బీజేపీకి టీడీపీ మద్దతు’ అంశాన్ని కూడా మాట్లాడుతారని వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నది.
Published by:Madhu Kota
First published: