ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి కరోనా సోకడంతో రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ముందుజాగ్రత్తగా బాధితులను కుటుంబ సభ్యులు, బంధువులు, వారిని కలిసిన వారందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు అధికారులు. అక్కడ జనాలు నిండిపోతుండడంతో దేవాలయాలను కూడా క్వారంటైన్ సెంటర్లుగా ఉపయోగించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో ముందుగా చిత్తూరులోని శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల్లో క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఆ దిశగా అధికారులు సన్నద్ధమవుతున్నారు.
ఐతే ఏపీ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది మంది హిందువులు ఆరాధించే దేవాలయాలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చడం శోచనీయమని మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు కన్నా. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఏపీలో కరోనా కేసుల సంఖ్య 266కి చేరిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap bjp, AP News, Coronavirus, Covid-19, Kanna Lakshmi Narayana