టీడీపీకి కరోనా రిలీఫ్... రెండు రకాలుగా... పార్టీలో చర్చ

కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు టీడీపీకి కొంతవరకు ఊరట కలిగించే విధంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: March 25, 2020, 7:58 PM IST
టీడీపీకి కరోనా రిలీఫ్... రెండు రకాలుగా... పార్టీలో చర్చ
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోని విపక్ష టీడీపీకి రాజకీయంగా బిగ్ రిలీఫ్ ఇచ్చిందా ? స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఊపిరి పీల్చుకున్నారా ? ఈ ప్రశ్నకు రాజకీయవర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. నిజానికి షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఉంటే... టీడీపీ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉండేదని ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, ఏకగ్రీవాల నుంచి టీడీపీ కోలుకుని గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోయిందని అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కరోనా ఎఫెక్ట్ కారణంగా ఎన్నికలు వాయిదా పడటం టీడీపీకి ఒక రకంగా పెద్ద ఊరట కలిగించే అంశమే అనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా టీడీపీకి కలిసొచ్చిన మరో అంశం... ఆ పార్టీ నుంచి వలసలు ఆగిపోవడం. ఒకవేళ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఉండి ఉంటే... అనేక మంది నేతలు ఆ పార్టీలోకి వెళ్లి ఉండేవారనే చర్చ జరుగుతోంది. వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా ఇప్పటికే అనేక మంది టీడీపీ నేతలు వైసీపీలో చేరిపోయారు. మరికొందరు కూడా క్యూలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే కరోనా ప్రభావం, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో... ఆ నేతలు ఇప్పుడు అధికార పార్టీ వైపు వెళ్లకుండా ఆగిపోయారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... వైసీపీ సైతం ఇప్పుడు రాజకీయ కార్యకలాపాలకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో... ఈ సమయంలో తమ పార్టీ నేతలను బుజ్జగించేందుకు టీడీపీ అధినేత సమయం దొరికిందనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి కరోనా కారణంగా టీడీపీకి రాజకీయంగా కొంతవరకు మేలు జరిగిందనే గుసగుసలు రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు