HOME »NEWS »POLITICS »consultations for new tpcc chief completed manicka tagore returns to delhi su

TPCC: కాంగ్రెస్‌లో ఉత్కంఠ రేపుతున్న పీసీసీ చీఫ్ ఎంపిక.. రేసులో ప్రధానంగా ఆ ముగ్గురి పేర్లు..!

TPCC: కాంగ్రెస్‌లో ఉత్కంఠ రేపుతున్న పీసీసీ చీఫ్ ఎంపిక.. రేసులో ప్రధానంగా ఆ ముగ్గురి పేర్లు..!
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ కాంగ్రెస్ నూతన సారథి ఎంపిక ఆ పార్టీలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

  • Share this:
    తెలంగాణ కాంగ్రెస్ నూతన సారథి ఎంపిక ఆ పార్టీలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ అధిష్టానం నూతన టీపీసీసీ సారథి ఎంపికపై దృష్టి సారించింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణికం ఠాగూర్ నాలుగు రోజుల పాటు పార్టీకి చెందిన నేతలతో చర్చలు జరిపారు. దాదాపు టీ కాంగ్రెస్‌కు చెందిన 200 మందితో ఆయన చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డిలు.. సీఎల్పీ నేత భట్టివిక్రమార్కతో సమావేశమయ్యారు. అన్ని అర్హతలు ఉన్నవారికే టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా నేతలు కోరారు. ఈ భేటీ అనంతరం వారు మాణికం ఠాగూర్‌తో సమావేశమై ఆయనతో ఇదే విషయాన్ని చెప్పారు. ఇక, ఈ చర్చలు ముగించుకున్న అనంతరం మాణికం ఠాగూరు శనివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు, రాష్ట్రంలోని పరిస్థితులపై సమగ్ర నివేదికను మరో మూడు నాలుగు రోజుల్లో మాణికం ఠాగూర్ పార్టీ అధిష్టానానికి అందజేయున్నారు.

    అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీపీసీసీ రేసులో ప్రధానంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, పార్టీలో సీనియర్ నేతకు, పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడికి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని చాలా మంది కాంగ్రెస్ నేతలు మాణికం ఠాగూర్‌ను కోరినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్ గట్టి పోటీ నిచ్చేలా పార్టీని ముందుకు తీసుకెళ్లే నేతలను టీపీసీపీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు కోరినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు సీనియర్ నేతల పేర్లను వీరు రాష్ట్ర ఇంచార్జ్ మాణికటం ఠాగూరుకు సూచించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ మధుయాష్కి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ లాంటి నేతలు టీపీసీసీ అధ్యక్షుడిగా తమకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.



    పీసీసీ అధ్యక్షుడి కసరత్తు ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి మారడంతో రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. పీసీపీ పీఠంపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు ఢిల్లీ వెళ్లి తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణకు చెందిన పార్టీ సీనియర్లను ఢిల్లీ పిలిచి టీపీసీసీ ఎంపికపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

    తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది. నాయకులు ఉన్నప్పటికీ ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ వస్తోంది. దీంతో పలువురు నేతలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును డిసైడ్ చేయనుంది. అందరికి అమోదయోగ్యమైన నాయకుడికి టీపీసీసీ బాధ్యతలను అప్పగించడంతో పాటుగా పార్టీలోని మిగతా ఆశావాహులను సంతృప్తి పరచాల్సిన అవసరం కాంగ్రెస్ అధిష్టానంపై ఉంటుంది. ఒకవేళ అలా జరగని పక్షంలో మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ వీడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:December 13, 2020, 09:01 IST