కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఇంకా చక్కబడనట్లే కనిపిస్తోంది. సీడబ్ల్యూసీ మీటింగ్‌లో సీనియర్లను రాహుల్ గాంధీ విమర్శించడంపై దుమారం రేగుతోంది. ఆ తర్వాత అలాంటిదేమీ జరగలేదని.. పార్టీ వివరణ ఇచ్చినప్పటికీ కోల్డ్ వార్ మాత్రం కొనసాగుతోంది. తాజాగా పార్టీ అధ్యక్ష పగ్గాలపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరగాలని.. ఎన్నికల ద్వారానే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడే కాదు.. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలోనూ ఎన్నికల ద్వారానే అధ్యక్షుడిని ఎన్నుకోవాలని స్పష్టం చేశారు. అంతేకాని నేరుగా నియమించడంతో పార్టీకి నష్టం జరుగుతుందన్నారు ఆజాద్. నేరుగా ఎంపికైన అధ్యక్షులకు పార్టీలో ఒక శాతం మంది మద్దతు కూడా ఉండకపోవచ్చని.. ఎన్నికల ద్వారా ఎన్నికైన అధ్యక్షుడికి 51శాతం మద్దతు ఉంటుందని తెలిపారు.

ఓట్ల ద్వారా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోపోతే మరో 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉంటుందని గులాంనబీ ఆజాద్ చెప్పారు. సంస్థాగత ఎన్నికల ద్వారానే పార్టీ పునాదులు బలపడతాయని పేర్కొన్నారు.
కాగా, ఆగస్టు 24న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్లపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సోనియా ఆస్పత్రిలో ఉన్న సమయంలో లేఖ ఎలా రాస్తారని.. బీజేపీతో కుమ్మక్కయ్యారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు CWC సమావేశంలో తీవ్ర దుమారంరేపాయి.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సీనియర్లు గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్ తప్పుబట్టారు. తాను బీజేపీతో కుమ్మక్కయ్యామని నిరూపిస్తే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు గులాం నబీ ఆజాద్. గడిచిన 30 ఏళ్లలో ఏనాడు బీజేపీకి అనుకూలంగా మాట్లాడలేదని.. పార్టీ కోసం కష్టపడితే తమనే నిందిస్తారా ? కపిల్ సిబల్ అన్నారు. ఐతే రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్ చేసిన కాసేపటికే.. ఈ ఇద్దరు నేతలు యూటర్న్ తీసుకున్నారు. అనంతరం పరిస్థితి చక్కబడిందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఆజాద్ చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.
Published by:Shiva Kumar Addula
First published:August 28, 2020, 06:40 IST