news18-telugu
Updated: February 12, 2020, 10:29 AM IST
ఏఐసీసీ ఆఫీసులో చిదంబరం (Image:ANI)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చిచ్చురేపుతున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్...ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే రకమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. 70 స్థానాల్లో 63 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రశంసల జల్లు కురిపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యలను సొంత పార్టీ మహిళా నాయకురాలు తప్పుబట్టారు. చిదంబరం వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిష్టా ముఖర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. బీజేపీని ఓడించే పనిని కాంగ్రెస్ పార్టీ ఏమైనా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు ఔట్ సోర్సింగ్ చేసిందా? అని ఆమె చిదంబరంను ప్రశ్నించారు. కాని పక్షంలో కాంగ్రెస్ ఓటమిపై విశ్లేషించుకోవాల్సిన మీరు..ఆప్ విజయంపై ఎందుకు సంతోషం వ్యక్తంచేస్తున్నారని ప్రశ్నించారు. అవును అయితే కాంగ్రెస్ దుకాణం బంద్ చేసుకోవడం మంచిదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్టా ముఖర్జీ.

షర్మిష్టా ముఖర్జీ(ఫైల్ ఫోటో)
కాంగ్రెస్ ఘోర పరాభవంపై షర్మిష్టా ముఖర్జీ అంతకు ముందు స్పందిస్తూ...ఢిల్లీ ఎన్నికలకు పార్టీలో రాష్ట్ర స్థాయి వ్యూహం, సమైక్యత కొరవడిందని ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు. అలాగే పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం, క్షేత్రస్థాయిలో ప్రజలతో పార్టీ సంబంధాలు కోల్పోవడం తదితర అంశాలు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలుగా విశ్లేషించారు. ఈ వ్యవస్థలో భాగస్వామ్యం అవుతున్నందుకు...ఓటమికి తాను కూడా బాధ్యతవహిస్తానని పేర్కొన్నారు.
బీజేపీ విచ్ఛిన్న రాజకీయాలు చేస్తుంటే...కేజ్రీవాల్ చాకచక్యమైన రాజకీయాలు చేస్తున్నారు...మరి మనం(కాంగ్రెస్ పార్టీ) ఏం చేస్తున్నామని ప్రశ్నిస్తూ షర్మిష్టా అంతకు ముందు మరో ట్వీట్ చేశారు. సొంత ఇంటిని చక్కదిద్దుకునేందుకు నిజాయితీగా మనం చర్యలు తీసుకున్నామా? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Published by:
Janardhan V
First published:
February 12, 2020, 10:29 AM IST