జగన్, కేసీఆర్ కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు... రంగంలోకి ఆ నలుగురు...

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉందని భావిస్తున్న టీఆర్ఎస్, వైఎస్‌ఆర్‌సీపీని తమ వైపు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే రంగంలోకి దిగినట్టు సమాచారం. అవసరాన్ని బట్టి ఈ రెండు పార్టీల అధినేతలైన కేసీఆర్, జగన్‌లతో చర్చలు జరిపించి ఒప్పించేందుకు కాంగ్రెస్‌కు చెందిన పలువురు ముఖ్యనేతల రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: May 10, 2019, 3:23 PM IST
జగన్, కేసీఆర్ కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు... రంగంలోకి ఆ నలుగురు...
కేసీఆర్, జగన్(File)
  • Share this:
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదనే భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ... మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలగా ఉంది. తమ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా... మిత్రపక్షాలు కలిసి వస్తే కేంద్రంలో అధికారంలో తమదే అనే నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ పెద్దలు... మిత్రపక్షాలను తమ వైపు తిప్పుకునే అంశంపై ఇప్పటి నుంచే దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉందని భావిస్తున్న టీఆర్ఎస్, వైఎస్‌ఆర్‌సీపీని తమ వైపు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే రంగంలోకి దిగినట్టు సమాచారం.

అవసరాన్ని బట్టి ఈ రెండు పార్టీల అధినేతలైన కేసీఆర్, జగన్‌లతో చర్చలు జరిపించి ఒప్పించేందుకు కాంగ్రెస్‌కు చెందిన పలువురు ముఖ్యనేతల రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్యభూమిక పోషించిన మాజీ కేంద్రమంత్రి చిదంబరంతో పాటు కేసీఆర్‌తో సత్సంబంధాలు కలిగిన మాజీ కేంద్రమంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను రంగంలోకి దించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌ను డీల్ చేయడం ఎలాగో ఆయనతో కలిసి పని చేసిన వీరికి బాగా తెలుసని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తమ వైపు తిప్పుకునేందుకు సైతం కాంగ్రెస్ తమ ప్రతినిధులను సిద్ధం చేసుకుంటున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పెద్దలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్దగా సంబంధాలు లేకపోయినప్పటికీ... ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంటే వైసీపీ అధినేతకు ప్రత్యేకమైన అభిమానం అని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రణబ్ అంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా ప్రత్యేకమైన అభిమానం. దీంతో ప్రణబ్ రంగంలోకి దిగితే... కేసీఆర్, జగన్ ఇద్దరూ తమ వైపు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి గులాం నబీ ఆజాద్‌ కూడా రంగంలోకి దిగి చక్రం తిప్పొచ్చని ఢిల్లీలోని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి కేసీఆర్, జగన్‌లను తనవైపు తిప్పుకునేందుకు ప్రణబ్, చిదంబరం, శరద్ పవార్, గులాం నబీ ఆజాద్‌ను రంగంలోకి దింపాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
First published: May 10, 2019, 2:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading