(మెదక్ నుంచి న్యూస్ 18 ప్రతినిధి పీవీ రమణ కుమార్)
దేశంలోనే మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు మెతుకు సీమగా ప్రసిద్ధిగాంచిన మెదక్ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రాతినిథ్యం వహిస్తుంది ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే. అంతేకాదు 1980లో కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ మెదక్ నియోజకవర్గం నుంచే విజయం సాధించి దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ ఎంపీ బాగారెడ్డి వరుసగా నాలుగు పర్యాయాలు ఇదే స్థానం నుంచి విజయం సాధించారు.
ఇంతటి ఘన చరిత్ర ఉన్న మెదక్ మాత్రం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు మొన్న మొన్నటి వరకు సరైన రోడ్డు సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక హైదరాబాద్ నుంచి చేగుంట మీదుగా మెదక్ వెళ్లే రహదారిని ఇటీవలే విస్తరించారు. దీంతో పాటు హైదారాబాద్-నర్సాపూర్-మెదక్ మీదుగా ఉన్న రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ది చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.
మరోవైపు... నియోజకవర్గ పరిధిలోని రైతాంగానికి సాగునీరు అందించేది సింగూరు జలాలు మాత్రమే. వర్షాభావంతో సింగూరు జలాలు కూడా ఇక్కడి ప్రాంత సాగునీటి అవసరాలు తీర్చడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే మల్లన్న సాగర్ నుంచి మంజీరా నదికి నీరందించి ఉమ్మడి మెదక్, నిజామాబాద్ ప్రజల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే అవకాశం ఉంటుంది.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో... ఒకప్పుడు ఇందిరాగాంధీని గెలిపించి ప్రధానిని చేసిన మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎదురీదుతోంది. వరుసగా మూడు పర్యాయాలు గెలుపుకు దూరమైన కాంగ్రెస్ పార్టీకి ఈ సారీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సిట్టింగ్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం మళ్లీ ఖరారు కాగా... కాంగ్రెస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో నిలిచారు.
2014లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ పార్లమెంట్, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయ సాధించారు. కేసీఆర్ సీఎం పదవి చేపట్టడంతో మెదక్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి గజ్వేల్ ఎమ్మెల్యేగా కొనసాగారు. కేసీఆర్ రాజీనామాతో ఖాళీ అయిన పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుచి బరిలో దిగిన కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో టీఆర్ఎస్ ఆరింటిలో.. కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. ఇటీవలి ఎన్నికల ఫలితాలతో ఊపు మీదున్న టీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గంలో మరోసారి పాగా వేస్తామన్న విశ్వాసంతో ఉంది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, సీనియర్ నేత మదన్ రెడ్డి తదితరులంతా మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని నాయకులే. వీరి ప్రభావంతో భారీ మెజారిటీతో జయ కేతనం ఎగురవేస్తామని నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సంగారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తదితర నేతలు కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే అంశాలు.
“తెలంగాణ ఏర్పాటయ్యాక జిల్లా కేంద్రమైంది. ఇప్పుడిప్పుడు రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. హైదరాబాద్ నుంచి నర్సాపూర్, మెదక్ మీదుగా హైవే రోడ్డు అవుతోంది. పరవాలేదు అనిపిస్తోంది. కానీ జరుగుతున్న అభివృద్ధి సరిపోదు. టీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీ మాకు పెద్దగా కనిపించలేదు. అందుకే టీఆర్ఎస్ కే మళ్లీ ఓటేస్తాం.” అంటున్నారు పాపన్నపేటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి రామకృష్ణ చెప్పారు.
నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని... వాటన్నింటిని అభివృద్ధి చేసేందుకు తన దగ్గర పూర్తి స్థాయి ప్రణాళిక ఉందని అనిల్ తెలిపారు.
“మా ప్రాంతం హైదరాబాద్ కు దగ్గరగా ఉంది. బాగానే డెవలప్ అయింది. కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ మా ప్రాంతం వాడే. ఆయనకే ఓటేస్తాం. టీఆర్ఎస్ పథకాలు బాగానే ఉన్నాయని ఎమ్మెల్యే ఎన్నికల్లో వాళ్లకు ఓటేశాం. ఈ సారి నేషనల్ పార్టీకి వేస్తాం.” అని చెప్పారు పఠాన్‌చెరుకు చెందిన టిఫిన్ సెంటర్ యజమాని ప్రవీణ్ అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి పోటీ ఏక పక్షంగానే కనిపిస్తున్నా ఓటరు మనసు ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ఎప్రెల్ 11న ఈవీఎంలలో నిక్షిప్తమయ్యే ప్రజా తీర్పు ఎలా ఉంటుందో ఓట్ల లెక్కింపు చేస్తేకానీ చెప్పలేం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Congress, Harish Rao, Indira Gandhi, Medak, Telangana, Trs