news18-telugu
Updated: October 24, 2019, 11:07 AM IST
ప్రతీకాత్మక చిత్రం
ఓ వైపు ఉధృతంగా ఆర్టీసీ సమ్మె.. మరోవైపు హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నిక.. సమ్మెతో బస్సులు దసరా వేళ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ కార్మికులపై కోపం ఉన్నా.. ప్రభుత్వం ఏం చేస్తోందని అంతా అసహనం వ్యక్తం చేశారు. ఆ ప్రభావం హుజూర్నగర్ ఉప ఎన్నికలో కనిపిస్తుందని అంతా అనుకున్నారు. అధికార టీఆర్ఎస్ ఓడిపోతుందని, మళ్లీ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని అంచనా వేశారు. కానీ, ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్దే గెలుపు అని స్పష్టం చేశాయి. వాస్తవంలోకి వచ్చేసరికి గులాబీదే పై చేయి అయ్యింది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? గత ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ ఈ సారి ఆ సీటును ఎందుకు కాపాడుకోలేకపోయింది? అంటే.. ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, సమన్వయలోపం, నేతల తీరే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నగారా మోగించడమే లేటు.. కాంగ్రెస్ తరఫున టికెట్ విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి పద్మావతికి టికెట్ ఇవ్వాలని ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తారంటూ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాను రేవంత్ ప్రశ్నించారు. స్థానికురాలు శ్యామల కిరణ్‌రెడ్డికి ఆ టికెట్ ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు.
ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చిచ్చు రేపాయి. సీనియర్లంతా ఒక్కొక్కరుగా ఉత్తమ్‌కు మద్దతు ఇచ్చారు. రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. రేవంత్ దిగివచ్చి పద్మావతిని గెలిపించుకుంటామని అన్నారు. అయితే, ఉత్తమ్, రేవంత్ వర్గ పోరు ఎన్నికలపై బాగానే పడింది. ఆ గ్రూపు గొడవలే మరోసారి కాంగ్రెస్‌ను దెబ్బతీశాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అదీకాక.. ఆర్టీసీ సమ్మె, టీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలను సొమ్ము చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని.. సొంత పార్టీ నేతలే అనుకుంటున్నట్లు సమాచారం.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
October 24, 2019, 11:07 AM IST