news18-telugu
Updated: November 11, 2019, 6:36 PM IST
ఉద్ధవ్ థాక్రే, సోనియాగాంధీ, శరద్ పవార్
మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్తమలుపు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని సోనియాగాంధీ నేతృత్వంలోని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. శివసేన ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలంటూ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఫోన్ చేశారు. దీనిపై సీడబ్ల్యూసీలో చర్చించిన ఆమె బయటి నుంచి మద్దతిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీంతో శివసేన - ఎన్సీపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా, కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వనుంది. అయితే, సీఎంగా ఉద్దవ్ థాక్రే ఉండాలని సోనియాగాంధీ కోరినట్టు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన వెంటనే శివసేన నేతలు అలర్ట్ అయ్యారు. ఆ పార్టీ నేతలు ఏక్నాథ్ షిండే, ఆదిత్య థాక్రే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలసిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తమకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాయని తెలుపుతూ ఆయా పార్టీల అంగీకార లేఖలను గవర్నర్కు సమర్పించారు.
తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - శివసేన కలసి పోటీ చేశాయి. బీజేపీకి 105 సీట్లు వచ్చాయి. శివసేనకు 56 స్థానాలు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సంఖ్యాబలం 149. శివసేనకు 56 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 54 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి 44 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిస్తే 154 సీట్లు వస్తాయి. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఉంటుంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 11, 2019, 6:21 PM IST