హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తెలంగాణ గవర్నర్ తమిళిసైపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై గవర్నర్‌ను కలవాలని తాము ఎంతగా ప్రయత్నిస్తున్నా... వీలుపడటం లేదని తమిళిసై సమక్షంలోనే ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో ఉన్న గవర్నర్ తమకు సమస్యలు చెప్పేందుకు అవకాశం ఇవ్వలేదని పరోక్షంగా అప్పటి గవర్నర్ నరసింహన్ తీరును తప్పుబట్టారు. మీరు అలా చేయొద్దని... తమకు సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించాలని కోరారు.
ఇక అలయ్ బలయ్ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకుల బొమ్మలు లేకపోవడాన్ని కూడా వీహెచ్ తప్పుబట్టారు. పార్టీలకు అతీతంగా దత్తాత్రేయ నిర్వహించే ఈ కార్యక్రమంలో తమ ఫోటోలు కూడా పెట్టాలని ఆయన నిర్వాహకులను కోరారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన తరువాత దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో లేదో అని తాను సందేహించానని... కానీ ఆయన మాత్రం తన ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి మరీ ఈ కార్యక్రమాన్ని యథాతథంగా నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని వీహెచ్ వ్యాఖ్యానించారు.
Published by:Kishore Akkaladevi
First published:October 10, 2019, 14:34 IST