CONGRESS SENIOR JANA REDDY TRYING HARD TO CONTEST HIS SON RAGHUVEER REDDY IN NEXT ASSEMBLY ELECTIONS AK
Jana Reddy: జానారెడ్డి ప్రయత్నం ఈసారైనా ఫలిస్తుందా ?.. లైన్ క్లియర్ అయినట్టేనా ?
జానారెడ్డి(ఫైల్ ఫోటో)
Telangana Politics: నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఒక చోట నుంచి తాను, మరో చోట నుంచి తన కుమారుడు రఘువీర్ రెడ్డి బరిలో ఉండేలా జానారెడ్డి ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారనే చర్చ ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో సాగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్లో జానారెడ్డి అందరికీ కంటే సీనియర్ నాయకుడు. ఉన్నంతలో కాంగ్రెస్ నేతలందరూ గౌరవించే ఒక్కే ఒక్క నాయకుడు కూడా జానారెడ్డి అనే చెప్పొచ్చు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తరువాత రాజకీయాల నుంచి ఆయన రిటైర్మెంట్ తీసుకుంటారని చాలామంది భావించారు. కానీ ఆయన మాత్రం ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. జానారెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితుడే అనే టాక్ ఉంది. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి దక్కడంలో జానారెడ్డి పాత్ర కూడా ఉందని.. పలువురు సీనియర్లు వ్యతిరేకించినా.. జానారెడ్డి మద్దతు కారణంగానే రేవంత్ రెడ్డికి ఈ పదవి దక్కిందనే వార్తలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తుంటాయి. ఇప్పటికీ కాంగ్రెస పార్టీ అంతర్గత సమావేశాల్లో రేవంత్ రెడ్డికి జానారెడ్డి మద్దతుగా నిలుస్తుంటారని పలువురు నేతలు చెబుతుంటారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డి.. తన కుమారుడిని పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయించాలని ప్రయత్నించి సక్సెస్ కాలేకపోయారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ స్థానాల నుంచి తాను, తన కుమారుడు బరిలో ఉండేలా చూడాలనుకున్న జానారెడ్డి ప్రయత్నాలు ప్రయత్నించలేదు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రకమైన ప్రయత్నాలు చేసి విఫలమైన జానారెడ్డి.. ఈసారి మాత్రం కచ్చితంగా తన కుమారుడిని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఒక చోట నుంచి తాను, మరో చోట నుంచి తన కుమారుడు రఘువీర్ రెడ్డి బరిలో ఉండేలా జానారెడ్డి ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారనే చర్చ ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో మొదటగా నిలిచేది జానారెడ్డి. ఎక్కువమంది నేతలు ఈ పదవి కోసం పోటీ పడితే.. అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా రేసులో ముందుండేది కూడా ఆయనే. అలాంటి జానారెడ్డి తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.
జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి (ఫైల్ ఫోటో)
సాగర్ ఉప ఎన్నికల్లోనూ జానారెడ్డికి బదులుగా ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి పోటీ చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. రఘువీర్ రెడ్డి బీజేపీలో చేరి అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తారని.. రఘువీర్ రెడ్డిని బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ నేతలు కూడా ప్రయత్నించారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. జానారెడ్డి సాగర్ ఉఫ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే అక్కడ టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. జానారెడ్డి వల్లే అది సాధ్యమైందని కాంగ్రెస్ వర్గాలు చెబుతుంటాయి. ఇక మిర్యాలగూడ నియోజకవర్గంపై జానారెడ్డికి మంచి పట్టుంది.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేశారు నల్లమోతు భాస్కర్ రావు. జానారెడ్డి వల్లే ఆయనకు మిర్యాలగూడ కాంగ్రెస్ టికెట్ వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతుంటాయి. ఆ తరువాత ఆయన టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ను గెలిపించుకోవడంతో పాటు ఇక్కడి నుంచి తన వారసుడిని ఎన్నికల బరిలో నిలపాలని జానారెడ్డి ప్లాన్ చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.