కాంగ్రెస్ దిగొస్తోందా... పీఎం సీటు త్యాగానికి సిద్ధమైందా ?

తమకు ప్రధాని పదవి దక్కకపోతే మరొకరికి ఆ పదవి రాకుండా అడ్డుకోబోమని పరోక్షంగా మిత్రపక్షాల్లో ఒకరు ప్రధాని అయినా పర్వాలేదు అన్నట్టుగా గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: May 16, 2019, 11:39 AM IST
కాంగ్రెస్ దిగొస్తోందా... పీఎం సీటు త్యాగానికి సిద్ధమైందా ?
రాహుల్ గాంధీ, సోనియాగాంధీ (ఫైల్ ఫోటో)
  • Share this:
లోక్ సభ ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో మెజార్టీ రాదనే భావనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ... ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహరచన మొదలుపెట్టింది. తమకు ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపై ఓ అంచనాకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ... ప్రాంతీయ పార్టీలను తమ వైపు తిప్పుకోగలిగితే కేంద్రంలో మళ్లీ అధికారం దక్కించుకోవచ్చనే ఆలోచనలో ఉంది. అయితే గతంలో మాదిరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీకి ప్రధాని పదవి వదులుకోవడానికి అనేక ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా లేవు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా... ప్రధాని పదవి మాత్రం తమకే కావాలని భావిస్తున్న పార్టీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రధాని పదవిపై కన్నేసినట్టు ఊహాగానాలు చాలారోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ మద్దతు తీసుకోవడానికి తాము సిద్ధమే అనే భావనలో ఉన్న టీఆర్ఎస్... స్టీరింగ్( ప్రధాని పదవి) మాత్రం మిత్రపక్షాలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రధాని పదవిని సైతం వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మానసికంగా సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. తమకు ప్రధాని పదవి దక్కకపోతే మరొకరికి ఆ పదవి రాకుండా అడ్డుకోబోమని పరోక్షంగా మిత్రపక్షాల్లో ఒకరు ప్రధాని అయినా పర్వాలేదు అన్నట్టుగా గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. సూటిగా మరొకరికి ప్రధాని పదవి ఇస్తామని ఆయన చెప్పకపోయినా... అలాంటి ప్రతిపాదనకు కూడా కాంగ్రెస్ సముఖంగానే ఉన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.


అయితే కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా మిత్రపక్షాలకు ప్రధాని పదవిని వదులుకుంటుందని ఊహించలేని పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే... చివరకు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే ప్రధాని అయ్యే అవకాశం ఉంటుందన్నది ఆ పార్టీ బలమైన నమ్మకం అని కొందరు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా... ముందు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగితే... ఆ తరువాత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడంపై దృష్టి పెట్టొచ్చని కాంగ్రెస్ లెక్కలు భావిస్తోందని మరికొందరు చర్చించుకుంటున్నారు.
First published: May 16, 2019, 11:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading