ప్రధాని నరేంద్ర మోడీ హెలికాప్టర్‌లోని ఆయన లగేజీని తనిఖీ చేశారన్న కారణంగా ఒడిశాలోని సంబల్పూర్లో ఎన్నికల పరిశీలకుడిని ఈసీ సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. మంగళవారం ప్రధాని మోడీ సంబల్పూర్ సభలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో ఆయన హెలికాప్టర్‌లోని లగేజీని కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిన మొహమ్మద్ మొహసిన్ తనిఖీ చేసేందుకు యత్నించారు. ఎస్పీజీ రక్షణలో ఉన్న నేతలపై తనిఖీలు చేపట్టవద్దనే మార్గదర్శకాల్ని ఉల్లంఘించారన్న ఆరోపణపై ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఈసీ చర్యలు తీసుకుంది.
దీనిపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నత అహ్మద్ పటేల్...ఎన్నికల సమయంలో ప్రస్తుత, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుల కాన్వాయ్‌లను ఈసీ అధికారులు తనిఖీలు చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎస్పీజీ రక్షణ కలిగిన వ్యక్తులను వ్యక్తిగతంగా తనిఖీలు చేయకూడదన్నారు. ప్రధాని మోదీ హెలికాప్టర్లో తనిఖీ చేసిన అధికారిని ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. దీని ద్వారా ఎలాంటి సందేశాన్ని పంపాలని భావిస్తున్నారని విమర్శించారు. ఎవరైనా చట్టానికి అతీతులా? అని అహ్మద్ పటేల్ ప్రశ్నించారు.
ఎస్పీజీ రక్షణ కలిగిన కాంగ్రెస్ నేతలను ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తున్నారని, ఇది బీజేపీ నేతలకు ఎందుకు వర్తించదని అహ్మద్ పటేల్ మరో ట్వీట్లో ప్రశ్నించారు.