రాహుల్‌గాంధీని భయపెడుతున్న అమేథీ.. స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోతున్నారా..

రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ(ఫైల్ ఫోటో)

Lok Sabha Elections 2019: రాహుల్ 2004 నుంచి అమేథీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009, 2014లో జరిగిన వరుసగా రాహుల్ గాంధీనే ఎంపీగా గెలుపొందారు. 2014లో స్మృతి ఇరానీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాహుల్‌కు 4,08,651 ఓట్లు రాగా, ఆయనపై పోటీచేసిన స్మృతి ఏకంగా 3,00,748 ఓట్లను దక్కించుకున్నారు.

  • Share this:
    లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి.. ఎవరు విజయం సాధిస్తారు.. ఎవరు ఓడిపోతారు.. ఏ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది.. అందరిలోనూ ఇవే ప్రశ్నలు. ఎన్డీయే కూటమి కేంద్రం అధికార పీఠాన్ని తనవద్దే ఉంచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడయ్యాయి. ఆ ఫలితాలే అన్ని ప్రతిపక్ష పార్టీలను కలవరపెడుతున్నాయి. అయితే, అన్నింటికన్నా ముఖ్యంగా ప్రధాని మోదీతో ఢీ అంటే ఢీ అంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. ఒకటి సొంత నియోజకవర్గం అమేథీ కాగా, మరోటి కేరళలోని వయనాడ్. వయనాడ్‌లో రాహుల్‌కు తిరుగులేదని స్పష్టమైంది. మరి.. అమేథీ‌లో ఆయన పరిస్థితి ఏంటి? అంటే.. కొన్ని ఛానెళ్లు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ గట్టి పోటీ ఇచ్చారని, హోరాహోరీ పోరు తప్పదని వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయడం కూడా అమేథీలో నష్టం కలిగించే అంశమని తెలిపింది. అంతేకాదు, అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓడిపోతారా? అన్న ప్రశ్నను కూడా ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా 'ఇండియా టుడే' తెరలేపింది.

    రాహుల్ 2004 నుంచి అమేథీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009, 2014లో జరిగిన వరుసగా రాహుల్ గాంధీనే ఎంపీగా గెలుపొందారు. 2014లో స్మృతి ఇరానీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాహుల్‌కు 4,08,651 ఓట్లు రాగా, ఆయనపై పోటీచేసిన స్మృతి ఏకంగా 3,00,748 ఓట్లను దక్కించుకున్నారు. స్మృతీ ఇరానీపై 1,07,903 ఓట్ల ఆధిక్యంతో రాహుల్ విజయం సాధించారు. అయితే.. ఈసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం 2014 నాటి పరిస్థితి ఉండకపోవచ్చని 'ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌పోల్‌' అభిప్రాయపడింది.

    ఇదిలా ఉండగా, 2014 ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లు అందించిన ఉత్తరప్రదేశ్ ఈ సారి కూడా పెద్ద మొత్తంలో సీట్లు అందించే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌ రెండు లేదా మూడు సీట్లు మాత్రమే దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు. అందులో సోనియా ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ కచ్చితంగా ఉంటుంది. ఈ ఎన్నికల్లోనూ ఆ నియోజకవర్గంలో సోనియాగాంధీ ఘనవిజయం సాధిస్తారని తాజా సర్వే తెలిపింది. 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న సోనియా మరోసారి ఈ స్థానాన్ని నిలుపుకుంటారని చెప్పింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకొచ్చిన దినేశ్‌ ప్రతాప్‌సింగ్‌ను బీజేపీ సోనియాపై పోటీకి నిలిపింది. కాగా, ఎస్పీ, బీఎస్పీ ఇక్కడ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు.
    First published: