హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్, గందరగోళంలో గద్దర్

తెలంగాణ ఉద్యమంలో ప్రజా గాయకుడిగా గద్దర్ ఓ సంచలనం. "పొడుస్తున్న పొద్దు మీద" అంటూ ఆయన ఇచ్చిన చైతన్య గీతిక యువతను కదం తొక్కేలా చేసింది. అలాంటి గద్దర్ ఇప్పుడు ఎటూకాకుండా అయిపోయారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తారనుకున్న స్థాయి నుంచీ అసలు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితికి ఆయన వచ్చేశారా? గద్దర్‌ సేవల్ని ఉపయోగించుకోవడంలో ప్రజా కూటమి ఫెయిలవుతోందా?

news18-telugu
Updated: November 20, 2018, 4:35 PM IST
హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్, గందరగోళంలో గద్దర్
ప్రజా గాయకుడు గద్దర్(File)
  • Share this:
తెలంగాణ ప్రజలు సాహితీ ప్రియులు. ఓ గంట పాటూ ఊదరగొట్టే ప్రసంగం కంటే, ఒక్క పాట వినిపిస్తే చాలు, ప్రజలు బాగా మమేకమవుతారు. ఈ విషయం తెలిసి కూడా ప్రజా కూటమి గద్దర్ సేవల్ని ఉపయోగించుకోవడంలో విఫలమవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని ప్రయత్నించిన గద్దర్, తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తన కొడుకు సూర్యంను... బెల్లంపల్లి నుంచీ బరిలో దింపాలనుకున్నా, ప్రజా కూటమి సర్దుబాట్లలో భాగంగా కాంగ్రెస్, ఆ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. తనకూ, తన కొడుకుకూ అన్యాయం జరిగిందనే ఆవేదనలో గద్దర్ ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి గద్దర్ ఈ ఎన్నికల్లో పోటీకి చెయ్యని ప్రయత్నం లేదు. ఢిల్లీ వెళ్లి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌తో మంతనాలు జరిపినా ఫలితం దక్కలేదు. గజ్వేల్ నుంచీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలనుకున్న ఆయన... తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్టీ తరపున ప్రచారం చేస్తానని, తన సేవల్ని పార్టీకి అంకితం చేస్తానని ప్రకటించారు. ఇంత మంచి అవకాశం ఇచ్చినా, కాంగ్రెస్ నేతల నుంచీ పాజిటివ్ సంకేతాలు రాలేదు. కాంగ్రెస్ రిలీజ్ చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో గద్దర్ పేరు లేదు. పోనీ ప్రచారానికైనా పిలిచారా అంటే అదీ లేదు. ఇటు టికెట్టూ ఇవ్వక, అటు సేవలూ వాడుకోకుండా, ఆయన్ని కాంగ్రెస్, కూరలో కరేపాకులా తీసి పారేసిందనే వాదన వినిపిస్తోంది.

మధుయాష్కీ, గద్దర్, ఆయన భార్య, కుమారుడు.. (ఫైల్ ఫొటో)
మధుయాష్కీ, గద్దర్, ఆయన భార్య, కుమారుడు. (ఫైల్ ఫొటో)


రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు టికెట్లు, పదవులూ ఆశించడం కామన్. గద్దర్ కూడా ఆ మధ్య సొంతంగా పార్టీ స్థాపించాలని ప్రయత్నించి, ఆ తర్వాత విరమించుకున్నారు. గద్దర్ లాంటి ప్రజాభిమానం ఉన్న వాళ్లు కచ్చితంగా ప్రభావం చూపించగలరు. ఆయనకు టికెట్ ఇవ్వకపోయినా, కనీసం ఆయన సేవల్నైనా ఉపయోగించుకుంటే, సామాజిక వర్గాల ఓట్లను కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలు మెరుగవుతాయి. గద్దర్ తన వైపు నుంచీ ఎంతో హుందాగా వ్యవహరించినా, కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయన్ను పక్కన పెట్టడంపై పొలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది. ఇప్పుడాయన ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి తలెత్తిందని ప్రత్యర్థి పార్టీలు జాలిగా చూస్తున్నాయి.

First published: November 20, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు