Home /News /politics /

CONGRESS NOT TO SUPPORT KODANDARAM IN WARANGAL KHAMMAM NALGONDA GRADUATE CONSTITUENCY MLC ELECTION AK

Kodandaram: కోదండరామ్‌కు కాంగ్రెస్ హ్యాండ్.. సారుది ఒంటరి పోరాటమే..

కోదండరామ్ (పైల్ ఫోటో)

కోదండరామ్ (పైల్ ఫోటో)

Kodandaram: తెలంగాణలో మరోసారి తన ఉనికిని చాటుకునేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలని నిర్ణయించుకున్న కోదండరామ్.. ఇందుకోసం నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం స్థానాన్ని ఎంచుకున్నారు.

    తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ తరువాత అంతటి కీలక పాత్ర పోషించిన వారిలో కోదండరామ్ ఒకరు. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ హోదాలో రాష్ట్రం మొత్తం తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో ఆయ పాత్ర ఎంతగానో ఉంది. అయితే తెలంగాణ ఏర్పాటు, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కోదండరామ్ ప్రాధాన్యత తగ్గిపోయింది. కేసీఆర్‌తో విభేదించి ఆ పార్టీపై రాజకీయ పోరాటాన్ని మొదలుపెట్టిన కోదండరామ్.. సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగారు. తెలంగాణ జనసమితి పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ‌కూటమితో జతకట్టారు. అయితే ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో.. కోదండరామ్‌కు చేదు అనుభవం ఎదురైంది.

    అయితే తెలంగాణలో మరోసారి తన ఉనికిని చాటుకునేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలని నిర్ణయించుకున్న కోదండరామ్.. ఇందుకోసం నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం స్థానాన్ని ఎంచుకున్నారు. ఈ ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలుస్తానని ధీమాగా ఉన్న కోదండరామ్... కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో నిలపకుండా తనకు మద్దతు ఇస్తుందని ఆయన భావిస్తూ వచ్చారు. కాంగ్రెస సైతం ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెబుతూ కొన్ని నెలలుగా కోదండరామ్‌ను ఊరిస్తూ వచ్చింది. అయితే తాజాగా కోదండరామ్‌కు షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.

    ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు... ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కమిటీలపై చర్చించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్.. అధిష్టానాన్ని కలిసి అభ్యర్థుల ఎంపికపై చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే... రంగారెడ్డి.. హైదరాబాద్.. పాలమూరు నియోజకవర్గం నుండి ... మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి , వంశీ పేర్లతో పాటు... ఉపాధ్యాయ సంఘం నుండి హర్ష వర్ధన్ పేరు కూడా హైకమాండ్‌కు పంపుతున్నారు. ఇక..వరంగల్..ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుండి... మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, బెల్లయా నాయక్ పేర్లు చర్చకు వచ్చాయి. అటు మానవతా రాయ్ పేరు కూడా పరిశీలిస్తున్నారు.

    కోదండరామ్ పోటీలో ఉన్న వరంగల్, నల్లగొండ, ఖమ్మం స్థానానికి కాంగ్రెస్ తరపున బెల్లయ్య నాయక్, రాములు నాయక్ సీటు ఆశిస్తుండటంతో.. వారిని కాదని కోదండరామ్‌కు కాంగ్రెస్ మద్దతిచ్చే అవకాశాలు చాలా తక్కువనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల్లో కోదండరామ్ ప్రభావం పెద్దగా ఉండదనే భావనలో ఉన్న కాంగ్రెస్.. ఇకపై ఆయనతో రాజకీయంగా చెలిమిని తెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి కేసీఆర్‌కు షాక్ ఇవ్వాలని భావిస్తున్న కోదండరామ్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఆదిలోనే ఝలక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Kodandaram, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు