కొట్టుకోబోయిన కాంగ్రెస్, బీజేపీ సభ్యులు...లోక్‌సభలో ఉద్రిక్తత

లోక్‌సభలో ఉద్రిక్తత

లోక్‌సభలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు దాదాపుగా కొట్టుకునేంత పనిచేశారు. మంత్రి హర్షవర్ధన్ పై కాంగ్రెస్ సభ్యులు భౌతికదాడికి ప్రయత్నించారని బీజేపీ సభ్యులు ఆరోపించారు.

 • Share this:
  లోక్‌సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశ్నోత్తరాల సెషన్‌లో కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రశ్నకు సమాధానిచ్చేందుకు మంత్రి హర్షవర్థన్ లేచారు. రాహుల్ ప్రశ్నకు సమాధానమివ్వడానికి ముందు ఢిల్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీనుద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆరు మాసాల తర్వాత ప్రధాని మోదీ ఇంటి నుంచి బయటకు రాలేరని ఢిల్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. నిరుద్యోగ సమస్య విషయంలో యువకులు ప్రధాని మోదీని కర్రలతో కొట్టే రోజు వస్తుందని రాహుల్ పేర్కొనడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీనుద్దేశించి రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనికి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

  మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం చెప్పారు. మాణిక్యం ఠాగూర్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ...మంత్రి వైపు కాంగ్రెస్ ఎంపీలు దూసుకురాకుండా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వారిని అడ్డుకున్నారు. కొందరు బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ సభ్యుల వైపు దూసుకొచ్చారు. దీంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభ సజావుగా నడిచే పరిస్థితి లేకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 1 గంట వరకు వాయిదావేశారు.  కాంగ్రెస్ ఎంపీల తీరుపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. మంత్రి హర్షవర్ధన్‌పై భౌతిక దాడి చేసేందుకు మాణిక్య ఠాగూర్‌, మరికొందరు కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రోద్భలంతోనే కాంగ్రెస్ సభ్యులు మంత్రి ప్రసంగాన్ని అడ్డుకుని, డాక్యుమెంట్లను చించేశారని ఆరోపించారు. వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు. కాంగ్రెస్ సభ్యులు సభలో గూంఢాగిరీ చేస్తున్నారంటూ ఆరోపించారు.

  కాగా పార్లమెంటులో తనను మాట్లాడనివ్వడం లేదంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్లమెంటులో మాట్లాడితే అధికార బీజేపీకి నచ్చడం లేదన్నారు. వయనాడ్ ప్రజలు మెడికల్ కాలేజీ కోరుకుంటున్నారని, ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తాలని తాను భావించినట్లు చెప్పారు. సభలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా సభా కార్యక్రమాలను బీజేపీయే అడ్డుకుంటోందని ఆరోపించారు.

  Published by:Janardhan V
  First published: