హోమ్ /వార్తలు /రాజకీయం /

మైహోం రామేశ్వర్‌ రావుకు షాక్... భూ కేటాయింపులపై హైకోర్టులో పిటిషన్

మైహోం రామేశ్వర్‌ రావుకు షాక్... భూ కేటాయింపులపై హైకోర్టులో పిటిషన్

ఓ వైపు కాంగ్రెస్‌లోని కొందరు నేతల మద్దతును కూడగడుతున్న రేవంత్.. టీఆర్ఎస్‌లోని అసంతృప్తి నేతలను కూడా తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఓ వైపు కాంగ్రెస్‌లోని కొందరు నేతల మద్దతును కూడగడుతున్న రేవంత్.. టీఆర్ఎస్‌లోని అసంతృప్తి నేతలను కూడా తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రామేశ్వర్ రావు తో పాటు, ప్రభుత్వానికి, DLF సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

మై హోం రామేశ్వర్ రావుకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు చేసిన భూ కేటాయింపులపై హైకోర్టు లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రాయదుర్గంలో వందలకోట్లు విలువచేసే భూమిని మైహోమ్ కు కేటాయించరని పిల్‌లో ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రూ. 38 కోట్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారన్నారు ఎంపీ రేవంత్. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రామేశ్వర్ రావు తో పాటు, ప్రభుత్వానికి, DLF సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాలపాటు కేసును వాయిదా వేసింది న్యాయస్థానం.

అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టడంతో మైహోం భూజా భవితవ్యం పై నీలినీడలు కమ్ముకున్నాయి. కేసు వివరాలలోకి వెళితే... భూజాకు అక్రమ భూ కేటాయింపుల చరిత్ర చూస్తే... రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 83లో 424.13 ఎకరాల భూమిని 2006వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ ఎంఎస్161 ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ)కి కేటాయించింది. పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం ద్వారా ఈ భూమి ప్రభుత్వానికి సంక్రమించింది. ఏపీఐఐసీకి ఈ భూమిని కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. ఈ భూమి ఐటీ జోన్ పరిధిలో ఉన్నందున దీనిని ఐటీ పార్కు, ఐటీ సంబంధిత ఇన్ ఫ్రా నిర్మాణాల కోసం మాత్రమే వినియోగించాలని స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ ద్వారా స్పష్టంగా పేర్కొంది.

ఈ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు డీఎల్ఎఫ్ లిమిటెడ్ అనే బహుళజాతి సంస్థ భూ కేటాయింపుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఇలా వచ్చిన దరఖాస్తులు షార్ట్ లిస్ట్ చేసి, డీఎల్ఎఫ్ ట్రాక్ రికార్డును పరిశీలించి ఆ సంస్థకు ఏపీఐఐసీ నుంచి భూ కేటాయింపులకు అప్పటి ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఏపీఐఐసీ నుంచి డీఎల్ఎఫ్ లిమిటెడ్ సబ్సిడరీ కంపెనీ అయిన డీఎల్ఎఫ్ రాయదుర్గం డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు రూ.580 కోట్ల విలువ చేసే 31.35 ఎకరాల భూమి బదలాయింపు జరిగింది. సర్వే నెంబర్ 83/1 లోని భూమిలోని ప్లాట్ నెంబర్ 6,7,11,12 లలో 25 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 14/p లో 6.3 ఎకరాలు డీఎల్ఎఫ్ కు కేటాయించారు. భూమిని కేటాయిస్తూ ఇచ్చిన లేఖలోని నిబంధన 16,17 ప్రకారం ఏపీఐఐసీ ద్వారా సేల్ డీడ్ ఇష్యూ అయ్యే వరకు ఈ భూమిని ఎవరికీ బదలాయించడం నిషేధం. అలాగే, లేఖ అందిన రోజు నుంచి ఆరునెలల్లో నిర్మాణ ప్రక్రియ ప్రారంభించి ఐదేళ్లలో పూర్తి చేయాలి. ఈ నిబంధన ఉల్లఘిస్తే భూ కేటాయింపును రద్దు చేయవచ్చు. ఈ ప్రకారం సెప్టెంబర్6, 2013న రిజిస్టర్డ్ సేల్ డీడ్ అయిన తర్వాత విచిత్రంగా డీఎల్ఎఫ్ రాయదుర్గం డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సంబంధిత అధికారులకు ఓ దరఖాస్తు అందింది. తమ కంపెనీ పేరును “అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్” గా మార్చుకోవడానికి అనుమతించాలన్నది ఆ దరఖాస్తు సారాంశం. దానికి సంబంధిత అధికారులు అనుమతి ఇచ్చారు. దీనికి కొనసాగింపుగా “అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్” నుంచి సంబంధిత అధికారులకు మరో దరఖాస్తు వచ్చింది. తమకు కేటాయించిన భూమికి బదులు సమీపంలో మరో భూమిని కేటాయించాలని, ఆ ప్రక్రియలో స్టాప్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయించాలని ఆ దరఖాస్తు సారాంశం. దానికి కూడా అనుమతి ఇచ్చేశారు.

అంతిమంగా దీనికి సంబంధించిన అధికారిక పత్రాలన్నింటినీ సేకరించి, తరచి చూస్తే అర్థమయ్యే విషయం ఏమిటంటే... డీఎల్ఎఫ్ లిమిటెడ్ కు చేసిన 31.35 ఎకరాల భూ కేటాయింపులలో అంతిమ లబ్దిదారు మైహోం కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నది సుస్పష్టమైంది. అక్వా స్పేస్ డెవలపర్స్ అనే కంపెనీ మై హోంకు షెల్ కంపెనీ అన్నది తేలింది. అంతిమంగా మైహోం కు భూమి కట్టబెట్టడం కోసం డీఎల్ఎఫ్ ద్వారా ఈ తతంగం అంతా నడిపారు. ఈ ప్రక్రియలో ఒప్పందాంలు, నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు చేయడమే కాక...ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది.రాష్ట్ర విభజనకు ముందు ఏపీఐఐసీ గా ఉన్న సంస్థ తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఎస్ఐఐసీగా మారింది. అంతిమంగా ఈ సంస్థ ద్వారానే అన్ని రకాల అక్రమాలకు తెరలేచింది. ఇలా అక్రమంగా జరిగిన భూ కేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దాని పర్యవసానంగా పిల్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, మైహోం, డీఎల్ఎఫ్ సంస్థలకు నోటీసులు జారీ చేసి, విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.

First published:

Tags: Revanth reddy, Telangana High Court, TV9