కాళేశ్వరం అంటూ తప్పుడు ప్రచారం... రేవంత్ రెడ్డి విమర్శలు

సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

కోహెడ ఘటనలో గాయపడిన వారికి పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

  • Share this:
    కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే వరి ఎక్కువగా పండిందని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతుల కష్టాన్ని ప్రభుత్వం ఖాతాల్లో వేసుకుంటుందని విమర్శించారు. హడావిడిగా కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌ను కోహెడకు ఎందుకు తరలించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కోహెడలో తాత్కాలిక షెడ్డు కూలి 26 మందికి తీవ్రగాయాలు అయ్యాయని... ఇప్పటివరకు మంత్రులు వాళ్ళను పరామర్శించలేదని ఆయన విమర్శించారు. ప్రభత్వ పెద్దల కన్ను కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ భూములపై పడిందని ఆరోపించారు. కోహెడలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసేవరకు కొత్తపేటలోనే ఫ్రూట్ మార్కెట్ ఉంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

    కోహెడ ఘటనలో గాయపడిన వారికి పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. రాచకొండ గుట్టల్లో ఎలాంటి వసతులు లేకుండా మార్కెట్ ఏర్పాటు చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటనకు కారకులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మాటలు తగ్గించి చేతల్లో చూపెట్టాలని వ్యాఖ్యానించారు. బత్తాయి పండ్లు ఎవరు ఇతర రాష్ట్రాలకు అమ్మొద్దన్న సీఎం కేసీఆర్... వాటిని ప్రభుత్వం ద్వారా కొనే ప్రయత్నం చేయలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బత్తాయి రైతులు తిరగబడితే అప్పుడు ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోమని చెప్పిందని... అప్పటికే బత్తాయి మురిగిపోయిందని అన్నారు. గన్నీ బ్యాగులు కూడా సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని... కందులు, బత్తాయి, పసుపు, వరి ఇలా ఏ పంటకు ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదని విమర్శించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: