ఎన్నికల ప్రచారంలో భాగంగా గత శనివారం ఉత్తరప్రదేశ్లో ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ ‘రాజీవ్ గాంధీ తన జీవితాన్ని నంబర్ వన్ అవినీతిపరుడిగా ముగించుకున్నారు’ అంటూ మాజీ ప్రధానిపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. బోఫోర్స్ కేసును ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు ప్రముఖులు మోదీపై భగ్గుమన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో, అసహనంతో మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ‘మోదీ ఇక మీ పోరాటం ముగిసింది. కర్మ ఫలితం కోసం ఎదురు చూడండి. మీ గురించి మీ అంతర్గత నమ్మకాలను మా నాన్న మీద ప్రొజెక్ట్ చేయాలని చూసినా అవి మిమ్మల్ని రక్షించలేవు. ప్రేమతో ఓ హగ్’ అని రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ వేదికగా మోదీని విమర్శించారు. ప్రియాంక గాంధీ కూడా మోదీపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.
అయితే, మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమని, చనిపోయినవారి పేరిట ఓట్లు దక్కించుకోవాలనుకోవడం సిగ్గుచేటు అని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. మరోవైపు, మోదీ ‘రాజీవ్ వ్యాఖ్యలు’ చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందని హస్తం పార్టీ ఆరోపించింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.