కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి కమల తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. తనతో పాటు మరికొందరు నేతలను కూడా బీజేపీలోకి తీసుకెళ్లాలని కోమటిరెడ్డి యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో ఆయన టచ్‌లో ఉన్నారు. దాంతో జగ్గారెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారా? అనే చర్చ తెలంగాణలో జోరుగా జరుగుతోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ బిగ్ షాక్ తప్పదు.
శనివారం నల్గొండలో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా సంచలన వ్యఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్కి బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నారు. పార్టీ అధిష్ఠానం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. తెలంగాణలో టీడీపీతో పొత్తుపెట్టుకొని కొంప ముంచారన్న కోమటిరెడ్డి... కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లే రాష్ట్ర నాయకత్వం స్పందించలేదని ఉత్తమ్‌పై ధ్వజమెత్తారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్నాయి. ఆయన తీరును కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం భేటీ కానుంది. కోమటిరెడ్డి తీరుపై చర్చించనున్న టీపీసీసీ పెద్దలు ఆయనపై చర్యలు తీసుకునే అవకాశముంది.
మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలవడం బీజేపీకి బిగ్ బూస్ట్ ఇచ్చింది. ఇదే ఊపుతో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని అమిత్ షా దృష్టిసారించారు. పలు పార్టీలకు చెందిన కీలక నేతలను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. టీడీపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలను పార్టీకిలోకి తీసుకునేందుకు బీజేపీ పెద్దలు ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరదీశారని తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణ పలువురు నేతలు కమలం కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.