CONGRESS MLA KOMATIREDDY RAJAGOPAL REDDY CONVINCED JAGGA REDDY TO POSTPONE HIS DECISION ON RESIGNATION AK
తెలంగాణ కాంగ్రెస్కు డబుల్ షాక్ తగలనుందా ?.. రేవంత్ రెడ్డికి మరో కొత్త సవాల్ ?
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
జగ్గారెడ్డి తన రాజీనామా విషయంలో ఏ వ్యూహంతో ముందుకు సాగుతున్నారన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. 15 రోజుల్లో ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తారా ? కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగిస్తే రాజీనామాపై వెనక్కి తగ్గుతారా అన్నది తెలియాల్సి ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందో ఎవరికీ అర్థంకావడం లేదు. ఓ వైపు బీజేపీ దూకుడు పెంచగా.. వారికి కౌంటర్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలు, విమర్శలు ప్రజల్లోకి అంతగా వెళ్లడం లేదనే వాదన ఉంది. ఇదిలా ఉండగానే.. కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని.. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్లో ఒకరైన జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు బుజ్జగించేందుకు అధిష్టానాన్ని కలిసేందుకు ప్రయత్నిస్తానని.. 15 రోజులు పాటు తన రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు.
అయితే జగ్గారెడ్డి తన రాజీనామా విషయంలో ఏ వ్యూహంతో ముందుకు సాగుతున్నారన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. 15 రోజుల్లో ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తారా ? కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగిస్తే రాజీనామాపై వెనక్కి తగ్గుతారా అన్నది తెలియాల్సి ఉంది. కానీ జగ్గారెడ్డి రెండు వారాల టైమ్ తీసుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డి రాజీనామా చేస్తానని ప్రకటించిన తరువాత మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డితో ఫోన్లో చర్చలు జరిపారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే విషయంలో ఇప్పుడే తొందరపడొద్దని ఆయన జగ్గారెడ్డికి సూచించినట్టు సమాచారం. కొద్దిరోజులు సమయం తీసుకోవాలని.. ఆ తరువాత ఇద్దరం కలిసి రాజీనామా విషయంలో ఓ నిర్ణయానికి వద్దామని రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం వల్లే రాజీనామా విషయంలో జగ్గారెడ్డి వెనక్కి తగ్గారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విషయంలో జగ్గారెడ్డిని ఎందుకు సంప్రదించారనే విషయం మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే పార్టీని వీడే సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి నిర్ణయం తీసుకుంటే.. ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావించారని.. ఇదే విషయాన్ని ఆయన జగ్గారెడ్డికి చెప్పారేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జగ్గారెడ్డి రాజీనామా వాయిదా విషయంలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించడం ఆసక్తికరంగా మారింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.