Konda Surekha: కొండా సురేఖ కండీషన్లకు కాంగ్రెస్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ?

కొండా దంపతులు ఫైల్ ఫోటో)

Konda Surekha: వచ్చే ఎన్నికల్లో మాత్రం తమకు పట్టున్న అన్ని నియోజకవర్గాల్లోనూ పట్టుబిగించాలని భావిస్తున్న కొండా దంపతులు.. ఇందుకోసం హుజూరాబాద్ ఉప ఎన్నికను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

  • Share this:
    హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగబోయే అభ్యర్థి ఎవరనే ఓ క్లారిటీ వస్తోంది. ఇక్కడి నుంచి మాజీమంత్రి కొండా సురేఖను బరిలోకి దింపాలని ఆ పార్టీ భావించింది. ఆ దిశగా అనేక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలకు గట్టి పోటీ ఇవ్వాలంటే బలమైన అభ్యర్థిని రేసులో దించాలని.. ఇందుకు మాజీమంత్రి కొండా సురేఖ అయితేనే బాగుంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావించారు. ఈ క్రమంలో హుజూరాబాద్ నుంచి బరిలోకి దిగేందుకు రేవంత్ రెడ్డి అండ్ టీమ్ కొండా సురేఖను ఒప్పించినట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ నాయకత్వం కోరినట్టుగా హుజూరాబాద్ నుంచి బరిలోకి దిగేందుకు అంగీకరించిన కొండా సురేఖ.. ఈ క్రమంలోనే పార్టీ నాయకత్వానికి కొన్ని కండీషన్ పెట్టినట్టు తెలుస్తోంది. హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలంటే.. వచ్చే ఎన్నికల్లోనూ ఈ సీటు తనకే ఇవ్వాలని ఆమె చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు పోటీ చేసి నియోజకవర్గంలో తాను బలంగా పెంచుకుంటానని.. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంపై పట్టు సాధిస్తానని ఆమె చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఫలితం ఎలా ఉన్నా.. రాబోయే ఎన్నికల్లోనూ ఈ సీటు తనకే ఇవ్వాలని ఆమె కోరినట్టు టాక్.

    అంతేకాదు హుజూరాబాద్‌తో పాటు వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాల్లోనూ తాము సూచించిన వ్యక్తులకే టికెట్ ఇవ్వాలని కొండా దంపతులు కాంగ్రెస్ నాయకత్వానికి సూచించినట్టు తెలుస్తోంది. ఈ మూడు నియోజకవర్గాలు అనుసంధానంగా ఉంటాయని.. కాబట్టి హుజూరాబాద్‌లో పోటీ చేయడంతో పాటు ఈ రెండు నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని ఇది కలిసి వస్తుందని కొండా వర్గం భావిస్తోంది. కొండా సురేఖకు వరంగల్ తూర్పుతో పాటు పరకాల, భూపాలపల్లిలోనూ అనుచరగణం ఉంది. అందుకే ఈ నియోజకవర్గాల్లో తమ కుటుంబసభ్యులు లేదా తమ అనుచరులకు సీట్లు ఇప్పించుకోవాలని కొండా వర్గం ప్లాన్ చేసింది. టీఆర్ఎస్‌లో ఇది సాధ్యంకాలేదు. కాంగ్రెస్‌లో చేరినప్పటికీ.. అప్పట్లో ఒక్క సీటుకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.

    అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం తమకు పట్టున్న అన్ని నియోజకవర్గాల్లోనూ పట్టుబిగించాలని భావిస్తున్న కొండా దంపతులు.. ఇందుకోసం హుజూరాబాద్ ఉప ఎన్నికను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు రాజకీయంగా బలంగా ఉండే కొండా దంపతులను ప్రొత్సహించడం ద్వారా కాంగ్రెస్‌కు కూడా వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని ఆ పార్టీ యోచిస్తోంది. అందుకే కొండా దంపతులు కండీషన్స్‌కు ఓకే చెప్పి.. హుజూరాబాద్‌లో వారు బరిలోకి దిగేలా ఒప్పించినట్టు సమాచారం. మొత్తానికి కొండా సురేఖ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్‌పై వారికి మరింత పట్టు దొరికినట్టే అనే చర్చ జోరుగా సాగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: