news18-telugu
Updated: June 5, 2019, 10:42 AM IST
ఉత్తమ్ కుమార్ రెడ్డి( ఫైల్ ఫోటో)
లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవాలని ప్లాన్ చేసిన టీఆర్ఎస్... ఆ తరువాత ఎందుకనో మనసు మార్చుకుంది. సంఖ్యాబలం లేకపోవడం వల్లే టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం ఆగిపోయిందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే తాజాగా నల్లగొండ ఎంపీగా విజయం సాధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనుండటంతో... టీఆర్ఎస్ పని సులువవుతుందనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ తరపున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే వారిలో 11 మంది టీఆర్ఎస్కు జై కొట్టారు.
ఇక, హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 18కి పడిపోనుంది. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకం చేస్తే కాంగ్రెస్ శాసనసభాపక్ష టీఆర్ఎస్ లో విలీనం అవుతుంది. అంటే 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు అనుకూలంగా సంతకం చేయాలి. ఇప్పటికే 11 మంది ఎలాగూ కారెక్కడంతో మరో ఎమ్మెల్యే టీఆర్ఎస్కు జై కొడితే కాంగ్రెస్ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనం అవనుంది. అయితే ఉత్తమ్ రాజీనామాతో ఆ అవసరం లేకుండానే కాంగ్రెస్ఎల్పీ టీఆర్ఎస్ఎల్పీలో విలీనమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అదనంగా మరో ఎంపీ సీటు గెలిచేందుకు కృషి చేసిన ఉత్తమ్ వల్లే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
First published:
June 5, 2019, 10:42 AM IST