ఆజాద్ ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ.. ఏం జరుగుతోంది..?

రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్ చేసిన కాసేపటికే.. కాంగ్రెస్ సీనియర్లు యూటర్న్ తీసుకున్నారు.

news18-telugu
Updated: August 24, 2020, 9:43 PM IST
ఆజాద్ ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ.. ఏం జరుగుతోంది..?
గులాం నబీ ఆజాద్
  • Share this:
కాంగ్రెస్‌లో పరిస్థితులు చక్కబడ్డాయని.. కొన్నాళ్ల పాటు సోనియా గాంధీ అధ్యక్షురాలిగా కొనసాగుతారని.. ఆ పార్టీ నేతలు ప్రకటించిన కాసేపటికే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేతలంతా ఢిల్లీలోని గులాంనబీ ఆజాద్ నివాసంలో భేటీ అయ్యారు. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం ఆజాద్ నివాసంలో కపిల్ సిబాల్, శశి థరూర్, మనీష్ తివారీ, ముకుల్ వాస్నిక్ సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఐతే ఉదయం సీడబ్ల్యూసీ భేటీ వాడీవేడీగా జరగడం, సీనియర్లపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు రావడం, ఆ తర్వాత రాహుల్ తీరుపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆ వెంటనే రాహుల్ అనలేదని యూ టర్న్ తీసుకోవడం, కొన్నాళ్ల పాటు సోనియా గాంధీయే ఏఐసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతారని ప్రకటించడం జరిగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ సీనియర్లు ఆజాద్ ఇంట్లో భేటీ అవడం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.


ఇవాళ వర్చువల్ విధానంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పార్టీ సీనియర్లంతా సమావేశానికి హాజరయ్యారు. ఐతే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికతో పాటు సోనియాకు సీనియర్లు రాసిన లేఖపైనా హాట్ హాట్‌గా చర్చ జరిగింది. సమావేశం ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా చేశారు. కొత్త అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని నేతలకు సూచించారు. ఐతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని అహ్మద్ పటేల్.. రాహుల్ గాంధీని కోరారు. మరికొందరు నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోనియా గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగితే బాగుంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోని అభిప్రాయపడ్డారు.

ఇక పార్టీలో నాయకత్వ మార్పునకు సంబంధించి ఇటీవల 23 మంది నేతలు సోనియా గాంధీకు లేఖ రాయడంపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోనియా ఆస్పత్రిలో ఉన్న సమయంలో లేఖ ఎలా రాస్తారని.. బీజేపీతో కుమ్మక్కయ్యారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే రాహుల్ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ తప్పుబట్టారు. తాను బీజేపీతో కుమ్మక్కయ్యామని నిరూపిస్తే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు గులాం నబీ ఆజాద్. అటు కపిల్ సిబల్ సైతం మొదట రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐతే రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్ చేసిన కాసేపటికే.. కాంగ్రెస్ సీనియర్లు యూటర్న్ తీసుకున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 24, 2020, 9:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading