CONGRESS LEADER VIJAYASHANTI WILL CONTEST FROM MEDAK OR DUBBAKA
మెదక్ లేదా దుబ్బాక అసెంబ్లీ బరిలో విజయశాంతి
కాంగ్రెస్ నేతలతో విజయశాంతి (ఫైల్ ఫోటో)
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని కొద్ది రోజుల క్రితం చెప్పిన విజయశాంతి... తాజాగా మెదక్ లేదా దుబ్బాక నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆమె విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తి రేపుతోంది.
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మనసు మార్చుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని గతంలో ప్రకటించిన రాములమ్మ... తాజాగా ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి... అప్పుడు మెదక్ అసెంబ్లీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు.
కొద్ది రోజుల క్రితం మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారిన విజయశాంతి... ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపికయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన విజయశాంతి... వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ మెదక్ నుంచి బరిలోకి ఉండొచ్చని ప్రచారం జరిగింది.
అయితే కొద్ది రోజుల క్రితం గజ్వేల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి విజయశాంతి రాయబారంతో కాంగ్రెస్‌తో చేరారు. ఆయన మెదక్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా తానే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటానని రాములమ్మ ప్రకటించారు. మెదక్ లేదా దుబ్బాక నుంచి తాను పోటీ చేస్తానని అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆమెకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తుందా అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న విజయశాంతితో తెలంగాణవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేయించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని విజయశాంతి భావిస్తే... ఆమె తన నియోజకవర్గానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె పోటీ చేసే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.