Shravan Kumar BommakantiShravan Kumar Bommakanti
|
news18-telugu
Updated: September 5, 2019, 2:00 PM IST
విజయశాంతి(ఫైల్ ఫోటో)
రాష్ట్ర ప్రజలు విష జ్వరాలతో విలవిల్లాడుతుంటే గులాబీ జెండాకు తామే ఓనర్లం అని ఓ వర్గం, కేసీఆర్ తప్ప మరెవ్వరూ లేరని మరో వర్గం వాదించుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనలో తనకే ముందుచూపు ఉందని ప్రకటించుకునే కేసీఆర్.. విష జ్వరాల విషయంలో ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. డెంగ్యూ, స్వైన్ ఫ్లూ జ్వరాలతో జనం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటే.. సీజనల్ వ్యాధులను సీరియస్ పరిగణించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ నేతలు చెబుతున్నారని విమర్శించారు. ఆరోగ్య సమస్యలను చూపించి... తనను బలిపశువును చేయాలనే కుట్ర జరుగుతోందని, మంత్రి ఈటల తన సన్నిహితులతో వాపోయినట్లు వార్తలు వచ్చాయని విజయశాంతి తెలిపారు. హైదరాబాద్లో పారిశుధ్య లోపం వల్లే రోగాలు వస్తున్నాయని అధికారులతో జరిగిన సమీక్షలో ఆరోగ్యమంత్రి అన్నారని, ఒక వేళ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వివాదంలో తనను ఇరికించాలని అనుకుంటే.. జీహెచ్ఎంసీని నడిపిస్తున్న కేటీఆర్ మెడకు చుట్టాలని ఈటల భావిస్తున్నట్లు టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారని ఆమె వెల్లడించారు.
మరోవైపు, హరీష్ రావు సీఎం కావాలంటూ టీఆర్ఎస్ నేత విష్ణు జోగులాంబ గుడిలో 1016 కొబ్బరికాయలు కొట్టడంపైనా ఆమె తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం సందట్లో సడేమియా అన్నట్లు తన అనుచరులతో వెయ్యి కొబ్బరి కాయలు కొట్టించి తాను సీఎం కావాలని మొక్కులు చెల్లిస్తున్నారని, అలా చాపకింద నీరులాగా పావులు కదుపుతున్న విషయం స్పష్టమైందన్నారు. ఇలా.. కేసీఆర్ అండ్ కో.. అధికార దాహంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
September 5, 2019, 2:00 PM IST