• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • CONGRESS LEADER VIJAYASHANTI FIRES ON CM KCR OVER TSRTC ROW BS

కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్.. కేసీఆర్‌పై విజయశాంతి తీవ్ర విమర్శలు..

కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్.. కేసీఆర్‌పై విజయశాంతి తీవ్ర విమర్శలు..

కేసీఆర్, విజయశాంతి

ఆర్టీసీలో సగభాగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు టీఆర్ఎస్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

 • Share this:
  ఆర్టీసీలో సగభాగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు టీఆర్ఎస్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకొని మిగిలిన శాఖల ఉద్యోగులపైనా పంజా విసిరేందుకు కేసీఆర్ సర్కారు సిద్ధమవుతోందన్న వాదన వినిపిస్తోందని ఆమె అన్నారు. మొత్తం వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు సీఎం వ్యూహం పన్నుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు విజయశాంతి తన ఫేస్‌బుక్ పేజీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకుని, మిగిలిన శాఖలకు చెందిన ఉద్యోగులపై కూడా పంజా విసరడానికి కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమవుతోందన్న వాదన వినిపిస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేసిన సీఎం దొరగారు.. ఆర్టీసీ సమ్మెను ఆసరాగా చేసుకుని తెలంగాణలోని ప్రభుత్వ శాఖలు అన్నిటినీ కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చ పోతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి’ అని తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టీసీతో మొదలైన కేసీఆర్ ప్రభుత్వ అరాచకం, రెవెన్యూ శాఖకు కూడా విస్తరించి.. అక్కడినుంచి మిగిలిన శాఖలకు కూడా వ్యాపించబోతోందన్న అనుమానాలు తెలంగాణ ప్రజల్లో బలపడుతున్నాయని ఆమె తెలిపారు. సచివాలయం లేకుండా ప్రగతి భవన్ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలను చక్కపెడుతున్న సీఎం దొరగారు.. అదే వ్యవస్థను ప్రభుత్వ శాఖల్లో కూడా అమలు చేయాలనుకోవడం దురదృష్టకరమని అన్నారు.

  ‘ఆర్టీసీ సమ్మెకు ప్రతిపక్షాలు బాధ్యత వహించాలని చేతులు దులుపుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. సమ్మె కారణంగా కార్మికుల ప్రాణాలు కోల్పోవడానికి కూడా ప్రతిపక్షాల బాధ్యత వహించాలని వితండవాదం చేస్తోంది. కేసిఆర్ ప్రభుత్వ వాలకం చూస్తుంటే మెట్రో రైలు స్టేషన్ పెచ్చులు ఊడిపడి అమాయకురాలు ప్రాణాలు కోల్పోతే... దాని బాధ్యత కూడా ప్రతిపక్షాలదే అంటారేమో? అంతేకాదు.. మొన్న ఓ లారీ డ్రైవర్ తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్‌గా బస్సును దురుసుగా నడిపి ఓ ఐటీ ఉద్యోగిని ప్రాణాలు తీసిన ఘటనకు కూడా ప్రతిపక్షాలే కారణమని ఆరోపిస్తారేమో? ఇవే కాదు, హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్‌పై నుంచి కారు కిందకి దూసుకువచ్చి ప్రాణాలు తీసిన ప్రమాదానికి కూడా ప్రతిపక్షాల కుట్రే కారణమని దొరగారు అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు!’ అంటూ దెప్పి పొడిచారు.

  తన వైఫల్యాలను ప్రతిపక్షాలకు మీదకు నెట్టడం సీఎం కేసీఆర్‌కు కొత్తేమీ కాదని, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు త్వరలోనే ఈ అరాచకానికి సరైన తీర్పుని సంఘటిత పోరాటాల ద్వారా తెలియచేస్తారని తాను విశ్వసిస్తున్నట్లు విజయశాంతి ఫేస్‌బుక్ పేజీలో కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

  First published:

  అగ్ర కథనాలు