Telangana assembly elections2018|తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆరే టార్గెట్గా విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు విజయశాంతి.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణ వచ్చేవరకు దళిత ముఖ్యమంత్రి అని ప్రచారం చేసిన కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడ్డాక తనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సోనియా గాంధీని అడిగారన్నారు. అందుకే కేసీఆర్ను సోనియాగాంధీ గెంటేశారని విజయశాంతి చెప్పారు. కేసీఆర్ కుట్రబుద్ధిని సోనియాగాంధీ అప్పుడే కనిపెట్టి.. కేసీఆర్ను దూరం పెట్టారని చెప్పారు. మాయమాటలతో అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్.. జనాలను మోసం చేసి సిగ్గులేకుండా మరోసారి ఓట్ల కోసం వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించిన విజయశాంతి.. టీఆర్ఎస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కృతజ్ఞత తెలిపేందుకు కుటుంబంతో కలిసి సోనియా దగ్గరకు వచ్చిన కేసీఆర్.. తన మనసులోని మాట బయటపెట్టారని చెప్పారు. తనను ముఖ్యమంత్రిని చేయాల్సిందిగా కోరారన్నారు. అయితే సోనియా అందుకు ఒప్పుకోలేదన్నారు.
ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని చెప్పి.. ప్రజలను దగా చేసిన కేసీఆర్ను ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజాకూటమికి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని విజయశాంతి అన్నారు.