news18-telugu
Updated: June 29, 2019, 7:17 PM IST
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ బాటలోనే ఇలా చేశానని క్లారిటీ ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి ఇంత సడన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయడంతో... రేవంత్ రెడ్డి కూడా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతుండగా... టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ టార్గెట్‌గానే రేవంత్ రెడ్డి ఈ రకమైన రాజకీయ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు చర్చించుకుంటున్నారు.
రాష్ట్రంలో కొన్నేళ్ల నుంచి టీ పీసీసీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి... అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా తన పదవిని వదులుకోలేదు. టీపీసీసీ చీఫ్ పదవిని వదులుకోవడానికి ఉత్తమ్ రెడీగానే ఉన్నారని వార్తలు వచ్చినా... ఆయన మాత్రం ఈ పదవిలో కొనసాగేందుకు తనవంతు లాబీయింగ్ చేసుకుంటున్నారనే టాక్ ఉంది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా కూడా ఉత్తమ్‌కు ఎప్పటికప్పుడు అండగా నిలుస్తుండటంతో... ముఖ్యనేతలు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారు. అయితే పార్టీ ఓటమికి అంతా బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ పిలుపు ఇవ్వడంతో... ఇదే అదునుగా రేవంత్ రెడ్డి తన వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు రాజీనామా చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్ ఉత్తమ్‌పై పడుతుందా లేదా అన్నది చూడాలి.
Published by:
Kishore Akkaladevi
First published:
June 29, 2019, 7:17 PM IST