పార్లమెంటులో ఖర్గే అడుగుపెట్టలేరన్న మోదీ.. నిజం చేసి చూపిన బీజేపీ..

నరేంద్ర మోదీ, మల్లికార్జున్ ఖర్గే (File)

Lok Sabha Elections 2019: మోదీ మాట్లాడుతూ.. ‘వచ్చే పార్లమెంటు సమావేశాలకు ఖర్గే హాజరు కారు’ అని అన్నారు. అంతే.. ఆయన మాటలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న బీజేపీ నాయకత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.

  • Share this:
    ఆయన 40 ఏళ్లలో ఎప్పుడూ ఓడిపోలేదు.. తొమ్మిది సార్లు అసెంబ్లీకి, రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.. అందుకే ఆయన్ను ఓటమెరుగని రారాజు అంటారు. 2014లో మోదీ ప్రభంజాన్ని కూడా తట్టుకొని నిలబడ్డ ఆ నాయకుడు.. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడయ్యారు. కానీ, ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటమి చవిచూశారు. ఆయనే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే. ఆయన తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అయిన డాక్టర్ ఉమేశ్ జాదవ్ చేతిలో 95వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1972 నుంచి ఇప్పటి వరకు 12 ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు తొలి ఓటమి ఎదురైంది. ఎన్నికలు అన్నాక ఒకరు ఓడిపోవడం.. మరొకరు గెలవడం కామనే. కానీ, ఖర్గే ఓడిపోవడం అంటే.. కాంగ్రెస్ నాయకత్వం ఓడిపోవడమే అంటారు రాజకీయ విశ్లేషకులు. అయితే, ఖర్గే ఓటమి వెనుక పెద్ద తతంగమే జరిగింది. దానికి మూల కారణం మోదీయే! అదెలా అంటారా.. గత పార్లమెంటు సమావేశాల్లో ఖర్గే అధికార పార్టీని, మోదీని ఇరుకున పెట్టే ప్రశ్నలు వేస్తూ ఉక్కిరి బిక్కిరి చేశారు. ప్రత్యర్థులను డిఫెన్స్‌లోకి నెట్టడంలో నేర్పరి అయిన మోదీ కూడా ఖర్గే ప్రశ్నలకు ఇబ్బంది పడ్డారు. ఆ సమావేశాల్లోనే ఓ సందర్భంలో మోదీ మాట్లాడుతూ.. ‘వచ్చే పార్లమెంటు సమావేశాలకు ఖర్గే హాజరు కారు’ అని అన్నారు. అంతే.. ఆయన మాటలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న బీజేపీ నాయకత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.

    పార్టీ జాతీయ నాయకత్వం నుంచి కర్ణాటక బీజేపీ నాయకులకు ఆదేశాలు కూడా అందాయి.. ఖర్గే గెలవకూడదు అంతే! అని. పెద్దల నుంచి వచ్చిన వ్యూహాలను క్షేత్రస్థాయి కార్యకర్తలు ప్రణాళికాబద్ధంగా అమలు చేశారు. ఖర్గేతో పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన ఉమేశ్ జాదవ్‌ను తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. తెర వెనుక ప్రచారాన్ని వేగవంతం చేశారు. మోదీ కూడా కలబురిగిలో సమావేశం పెట్టారు. అలా పక్కా ప్రణాళికతో ఖర్గేను ఓడించారు.

    కర్ణాటకలో కుల రాజకీయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆ దిశగా దృష్టి పెట్టిన బీజేపీ నాయకత్వం అన్ని కులాలను ఏకం చేసి ఉమేశ్ గెలుపు కోసం కృషి చేసింది. కుల సమీకరణాలతో పాటు ఓటు బ్యాంకు కూడా తోడవ్వడంతో ఉమేశ్ గెలులు లాంఛనమైంది. ఖర్గే ఓటమికి ఆయన కుమారుడు కూడా ఓ కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. మోదీ అన్న మాట నిజమైందిగా.
    First published: