news18-telugu
Updated: November 7, 2020, 3:28 PM IST
విజయశాంతి (ఫైల్ ఫోటో)
విజయశాంతి పార్టీ వీడతారనేది ఆందోళన కలిగించే విషయమని ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ అన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ వీడతారని వస్తున్న ఊహాగానాలపై స్పందించిన మధుయాష్కీ.. కాంగ్రెస్ పార్టీపై ఆమెకు అసంతృప్తి లేదని వ్యాఖ్యానించారు. విజయశాంతి అసంతృప్తి నాయకులపైనే అని అభిప్రాయపడ్డారు. దీనిపై సోనియాగాంధీ కూడా దృష్టి పెట్టారని.. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌తో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని కోరారని మధుయాష్కీ తెలిపారు. పార్టీలో విజయశాంతి సీనియర్ నాయకురాలని, ప్రజాభిమానం పొందిన వ్యక్తి అని తెలపారు.
సోనియాగాంధీ అంటే విజయశాంతికి చాలా అభిమానమని మధుయాష్కీ అన్నారు. సోనియాపై ఉన్న గౌరవంతోనే విజయశాంతి టీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరారని గుర్తు చేశారు. విజయశాంతి అసంతృప్తికి రాష్ట్ర నాయకత్వం లోపం కూడా ఉందని మధుయాష్కీ అన్నారు. రాష్ట్ర నాయకత్వం సరైన విధంగా ఆమె సేవలను ఉపయోగించుకోలేదని తెలిపారు. విజయశాంతి పార్టీ వీడబోరని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని మధుయాష్కీ అభిప్రాయపడ్డారు.
ఇక కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి.. దుబ్బాక ఉప ఎన్నికల తరువాత బీజేపీలోకి వెళతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో విజయశాంతి భేటీ కావడం... ఆ తరువాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విజయశాంతిపై ప్రశంసలు కురిపించడంతో.. ఆమె కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. విజయశాంతితో ఇటీవల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి చర్చించినా పెద్దగా ఫలితం లేకుండా పోయిందనే టాక్ ఉంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ రంగంలోకి దిగారు. విజయశాంతిని కలిసేందుకు నేరుగా ఆమె నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఠాగూర్ ఆమెతో సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా విజయశాంతి పలు విషయాలను ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని విజయశాంతి.. ఠాగూర్‌కు స్పష్టంగా వివరించారు. రాహుల్ గాంధీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా తన తెలంగాణ పర్యటనను అడ్డుకున్నారని ఠాగూర్‌కు విజయశాంతి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
అయితే ఈ సమావేశం తరువాత విజయశాంతి మెత్తబడి మనసు మార్చుకున్నారా లేక కాంగ్రెస్‌ను వీడాలనే నిర్ణయించుకున్నారా ? అన్నది తెలియరాలేదు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ నుంచి అనేక మంది నేతలను ఆకర్షించాలని బీజేపీ ప్లాన్ చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అనేక మంది కాంగ్రెస్ నేతలు త్వరలోనే బీజేపీలోకి వెళతారని కొద్దిరోజుల క్రితం మీడియాలో చిట్ చాట్ చేసిన తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లే నాయకుల జాబితాలో విజయశాంతి ముందుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Published by:
Kishore Akkaladevi
First published:
November 7, 2020, 3:25 PM IST