ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూనే తిరుగుతుంటాయి. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర పనులు, వైఫల్యాలు తదితర అంశాలపై ప్రతిపక్షాలకు చెందిన నేతలు వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చూస్తునే ఉంటాయి. తాజాగా వైఎస్ జగన్ కాంగ్రెస్ సీనియర్ నేత, వైఎస్ఆర్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది. జగన్ కు జనాదరణ తగ్గలేదని... ఆయనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపైనా ఇలాంటి ఆరోపణలే వచ్చాయని కానీ 2009 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఘనవిజయం సాధించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ప్రజలు జగన్ విషయంలో పాజిటివ్ గానే ఉన్నారన్నారు. ఐతే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది తాను చెప్పలేనన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న కేవీపీ.. జగన్ కు పాజిటివ్ గా మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. ఆయన కాంగ్రెస్ నేతగా మాట్లాడారా..? లేక వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా మాట్లాడారా అనేది చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ఉత్తమ సీఎంగా జగన్ ర్యాంక్ భారిగా పడోయింది. గతేడాది నాలుగో స్థానంలో ఉన్న జగన్ పై ఏడాది తిరక్కుండానే 16వ స్థానానికి పడిపోయారు. జనంలో ఆయనపై 19 శాతం మేర వ్యతిరేకత పెరిగిందని ఆ సర్వే చెప్పింది. ఐతే జగన్ గ్రాఫ్ ఇలా అమాంతంగా పడిపోవడానికి గల కారణాలను ఇండియా టుడే వెల్లడించలేదు. కేవలం జగన్ పై ఏపీలో 11 శాతం మేర వ్యతిరేకత పెరిగిందని మాత్రమే చెప్పింది. గత సర్వేతో పోలిస్తే సొంత రాష్ట్రంలో జగన్ కు 19శాతం ఆదరణ తగ్గినట్టు ఆ సంస్థ ప్రకటించింది. జాతీయ స్థాయిలో 5 శాతం ఆదరణ తగ్గినట్టు పేర్కొంది. తిరుగులేని సంక్షేమం అంటూ ఊదరగొడుతున్నా... కోట్లకు కోట్లు ఖర్చు చేసి సొంత ప్రచారం చేసుకుంటున్నా... ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రజాదరణ తగ్గిపోతోంది. ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో జగన్ గ్రాఫ్ బాగా దిగజారినట్లు వెల్లడైంది.
అయితే ఈ ఏడాది కాలంగా జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మొదట విపక్షాల వాయిస్ ప్రజలకు అంత చేరువ అయ్యేది కాదు.. కానీ ఇప్పుడు విపక్షాలు చేస్తున్న ప్రచారం ప్రజల్లోకి వెళ్తోంది. ముఖ్యంగా రాష్ట్రం అప్పుల పాలవ్వడం.. సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. కరోనా నిర్ణయాలు.. పరీక్షల నిర్వహణపై తర్జన భర్జన లాంటి అంశాలు కూడా ప్రభావం చూపి ఉండొచ్చు.
ఇక సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ హయంలో జరిగిన ఒక్క అవినీతి కూడా వైసీపీ నిరూపించలేకపోయింది. దీంతో వైసీపీ అంతా అసత్యాలే ప్రచారం చేసిందని జనం నమ్మే పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారనే నెపంతో సామాన్యులను కూడా అరెస్ట్ చేయడం లాంటివి అన్నీ జగన్ పై వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.