CONGRESS LEADER JANAREDDY FAILED TO GAIN MAJORITY EVEN IN HIS OWN MANDAL IN NAGARJUNA SAGAR CONSTITUENCY AK
Nagarjuna Sagar By Election Result: సాగర్‌లో జానారెడ్డికి మరో షాక్.. సొంత మండలంలోనూ లభించని ఊరట
జానారెడ్డి (ఫైల్ ఫొటో)
Nagarjuna Sagar By Election Result: 15వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తమ సమీప ప్రత్యర్థి జానారెడ్డిపై 9914 ఓట్ల ఆధిక్యత సాధించారు.
టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఫలితాలు ఆ పార్టీ ఊహించిన విధంగానే వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని భావించిన టీఆర్ఎస్.. అందుకు తగిన వ్యూహరచనతో ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు 15వ రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తమ సమీప ప్రత్యర్థి జానారెడ్డిపై 9914 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఇప్పటివరకు కౌంటింగ్ జరిగిన రౌండ్లలో ఒకటి రెండు రౌండ్లు మినహాయిస్తే కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఆధిక్యత సాధించలేదు. కొన్ని రౌండ్ల టీఆర్ఎస్కు కాస్త తక్కువ మెజార్టీ లభించినప్పటికీ.. ఆ పార్టీకి మెజార్టీ మాత్రం కొనసాగుతూ వస్తోంది. ఇక నియోజకవర్గంలోని జానారెడ్డి సొంత మండలం అనుములలోనూ ఆయన ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఇక్కడ కూడా ఆయనకు మెజార్టీ రాకపోవడం గమనార్హం. ఇక సాగర్‌లో కౌంటింగ్ ప్రక్రియ సగానికిపైగా పూర్తికావడం.. తమ అభ్యర్థి మెజార్టీలో కొనసాగుతుండటంతో టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎదురైన అనుభవంతో సాగర్‌లో కచ్చితంగా విజయం సాధించాలని భావించిన టీఆర్ఎస్.. అందుకు తగ్గట్టుగా పావులు కదిపింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ ఉప ఎన్నికల అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేు, ముఖ్యనేతలు క్షేత్రస్థాయిలో దిగి పార్టీ విజయం కోసం కృషి చేశారు. ఇక ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. సాగర్ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సొంత నియోజకవర్గం కావడం.. ఆయనే బరిలో ఉండటంతో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సాగింది. దుబ్బాకలో టీఆర్ఎస్కు షాకిచ్చిన బీజేపీ.. నాగార్జునసాగర్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని ఓట్ల లెక్కింపు సరళిని బట్టి అర్థమవుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.