news18-telugu
Updated: March 13, 2020, 5:45 PM IST
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్నులు పెంచడాన్ని టీపీసీసీ కోశాధికారి గుడూరు నారాయణరెడ్డి తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ప్రభుత్వం మొదటి నుంచి రాష్ట్ర ఆర్ధికవ్యవస్థను అస్తవ్యస్తంగా నిర్వహిస్తోందని ఆయన ఆరోపించారు. బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఆదాయాల మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. విచక్షణారహితంగా అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టివేసిందని మండిపడ్డారు. దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా ఆర్థిక మాంద్యం లోకూడా రూ. 1.82 లక్షల కోట్ల అవాస్తవ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏంటని గూడురు నారాయణరెడ్డి ప్రశ్నించారు. ఆ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి సామాన్యులపై భారం మోపుతోందని విమర్శించారు.

కాంగ్రెస్ నేత గూడురు నారాయణరెడ్డి(ఫైల్ ఫోటో)
ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రజలు ఇబంది పడుతున్నారని... ఆర్థిక మాంద్యం కారణంగా… రాబడులు తగ్గడంతోపాటు, ఉద్యోగాలు ఊడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధనంపై అధిక పన్నులు, సర్చార్జీలు వసూలు చేస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని ఆయన ధ్వజమెత్తారు. కిలోమీటరుకు 20 పైసలు లెక్కన ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యులకు భారం కలిగించిన కేసీఆర్ ప్రభుత్వం... తాజాగా విద్యుత్ ఛార్జ్ లు పెంచడం వాణిజ్య, పరిశ్రమ రంగాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. ఆర్థిక మందగమనం స్థిరాస్తి రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని సమీక్షించి, సామాన్యులపై అదనపు భారం పడకుండా వృద్ధిని సాధించే వాస్తవిక విధానాన్ని అవలంబించాలని గూడురు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు.
Published by:
Kishore Akkaladevi
First published:
March 13, 2020, 5:45 PM IST