news18-telugu
Updated: November 6, 2020, 4:13 PM IST
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో)
కొన్నేళ్లుగా టీపీసీసీ చీఫ్‌గా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త నాయకుడిని ఎంపిక చేస్తారని అనేక నెలలుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కాంగ్రెస్ అధినాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటికప్పుడు దీనిపై ఊహాగానాలు రావడం తప్పితే... కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం టీపీసీసీ చీఫ్ మార్పు అంశంపై ఫోకస్ పెట్టినట్టు కనిపించడం లేదు. ఈ పదవి కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నా... హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారంతా సైలెంట్ అయిపోయారనే వాదనలు కూడా ఉన్నాయి.
అయితే తాజాగా టీపీసీసీ చీఫ్ మార్పుపై నిజామాబాద్ మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అవసరం ఉందన్న మధు యాష్కీ.. దుబ్బాక ఫలితాల తర్వాత పీసీసీ మార్పుకు అవకాశం ఉండవచ్చని తెలిపారు. టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ తమ రిపోర్టులు హైకమాండ్‌కు అందిస్తారని మధుయాష్కీ వ్యాఖ్యానించారు. ఆ తరువాత అధిష్టానం పీసీసీ మార్పు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

మధుయాష్కీ(ఫైల్ ఫోటో)
జాతీయ స్థాయిలో పార్టీ నాయకత్వలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దుబ్బాక ఫలితం ఎలా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహాంతో ముందుకు వెళ్తుందని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సైతం ఆ దిశలో ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉందన్న మధుయాష్కీ... నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని రాహుల్ గాంధీ సూచించారని తెలిపారు. ఫలితాలు ఎలా ఉన్నా ఏమీ ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్లాలని ఆదేశించారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కింది స్థాయి కార్యకర్త వరకూ అందరూ కృషి చేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
Published by:
Kishore Akkaladevi
First published:
November 6, 2020, 4:08 PM IST