కర్ణాటకలో కమల వికాసం.. కూలిపోనున్న కుమారస్వామి సర్కారు?

Lok Sabha Elections 2019: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప ఇది వరకే తేల్చి చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రానికి కుమారస్వామి సర్కారు కూలిపోతుందంటూ కేంద్ర మంత్రి సదానందగౌడ వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: May 23, 2019, 11:39 AM IST
కర్ణాటకలో కమల వికాసం.. కూలిపోనున్న కుమారస్వామి సర్కారు?
సీఎం కుమారస్వామి (ఫైల్)
  • Share this:
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ కర్ణాటక సీఎం కుమారస్వామి మైసూర్ చాముండేశ్వరి ఆలయంలో ఈ రోజు ఉదయం పూజలు చేశారు. అయితే, ఆయన పూజలు ఫలించలేదు. ఫలితాల్లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో జేడీఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితం కాగా, దాని మిత్ర పక్షం కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. ప్రతిపక్ష బీజేపీ 23 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతుండగా, ఆ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన మాజీ మంత్రి అంబరీష్ సతీమణి సుమలత మాండ్యాలో విజయం దిశగా దూసుకుపోతున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకే సుమలత మద్దతు ఉంటుందని ఆమె మద్దతుదారులు స్పష్టం చేశారు. దీంతో ఆమె బీజేపీవైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు కుమారస్వామి సర్కారు భవితవ్యాన్ని నిర్ణయించేవి కావడం విశేషం. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప ఇది వరకే తేల్చి చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రానికి కుమారస్వామి సర్కారు కూలిపోతుందంటూ కేంద్ర మంత్రి సదానందగౌడ వ్యాఖ్యానించారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాహాటంగానే సిద్ధరామయ్య తీరుపై తమ అంసతృప్తిని వెళ్లగక్కారు. పరువురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారన్న కథనాలు కూడా వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కుమారస్వామి సర్కారు పాలిట పిడుగుపాటులా పరిణమించాయి. ఇక ఏ క్షణంలోనైనా జేడీఎస్-కాంగ్రెస్ కూటమి సర్కారు కూలిపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు మధ్య ప్రదేశ్‌లోనూ బొటాబొటి మెజారిటీతో అధికారంలో ఉన్న కమల్‌నాథ్ సర్కారు భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఆ రాష్ట్ర బీజేపీ.. మెజారిటీ నిరూపించుకోవాలని కాంగ్రెస్‌కు సవాల్ విసిరింది. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ కూడా సమర్పించింది.

First published: May 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>