news18-telugu
Updated: December 15, 2018, 9:34 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించినప్పటికీ.. ఉద్యోగవర్గాలు మాత్రం ప్రజాకూటమికే మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో గ్రామీణ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఆయా అభ్యర్థులకు పోలైన ఓట్ల సంఖ్యను పరిశీలించగా ఇదే విషయం స్పష్టమవుతోంది. ఎన్నికల విధుల్లో భాగంగా నేరుగా ఓటేసే అవకాశం లేని ఉద్యోగులు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ అందలేదని చాలామంది ఓటు వేయలేకపోయారు కూడా.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటువేసిన ఉద్యోగుల్లో అధికశాతం ప్రజాకూటమి వైపే మొగ్గుచూపినట్టు పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు తెలియజేస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లాలోని పది గ్రామీణ నియోజకవర్గాల్లో జరిగిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థులే అధిక్యతను ప్రదర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థుల కంటే రెట్టింపు స్థాయిలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి. తాండూరులో మొత్తం 1028 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా, అందులో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డికి 685 పడగా, మహేందర్ రెడ్డికి 195, బీజేపీ అభ్యర్థికి 122 ఓట్లు దక్కాయి. అటు వికారాబాద్లోనూ మొత్తం 1106 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు టీఆర్ఎస్ 159, కాంగ్రెస్ 593, ఫార్వర్డ్ బ్లాక్ 285 ఓట్లు దక్కించుకున్నాయి. పరిగిలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ 1836 ఓట్లు నమోదుకాగా టీఆర్ఎస్, బీజేపీలకు 159 చొప్పున పడగా, కాంగ్రెస్‌కు 1085 ఓట్లు దక్కాయి. చేవెళ్లలో మొత్తం 779 బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్కు 298, కాంగ్రెస్‌కు 408 ఓట్లు వచ్చాయి. మహేశ్వరం నియోజకవర్గంలో 1531 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్కు కేవలం 40 ఓట్లు మాత్రమే పడగా, కాంగ్రెస్ 850 ఓట్లు, బీజేపీ 203 ఓట్లు దక్కించుకున్నాయి. ఇబ్రహీంపట్నంలో నమోదైన 1138 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ 367, బీఎస్పీకి (కాంగ్రెస్ మద్దతు) 478, బీజేపీకి 106, టీడీపీకి 101 ఓట్లు దక్కాయి.
కొడంగల్‌లో 712 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి 531 పడగా, టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి 171 ఓట్లు మాత్రమే దక్కాయి. అటు కల్వకుర్తిలోనూ 789 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్కు 142 రాగా, కాంగ్రెస్‌కు 323 ఓట్లు, బీజేపీ 522 ఓట్లు వచ్చాయి. ఉమ్మడి జిల్లాల్లోని అన్ని గ్రామీణ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ లెక్కన ఉద్యోగులంతా ప్రజాకూటమికే మద్దతు తెలిపారని తేటతెల్లమవుతోంది. ఈవీఎం ఓట్లలో భారీ మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సాధించడంలో మాత్రం వెనుకబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో కొన్ని వర్గాలు టీఆర్ఎస్ తీరుపై పీకలదాకా కోపంతో ఉన్న విషయం తెలిసిందే. ఐఆర్, పీఆర్ఎసీ, సీపీఎస్ విధానాలపై ఎన్నికలకు ముందు బహిరంగ నిర్వహించి తమ కోపాన్ని తెలియజేశాయి. అదే కోపాన్ని ఎన్నికల్లోనూ చూపించినట్టు అవగతమవుతోంది.
ఇవి కూడా చదవండి
Published by:
Santhosh Kumar Pyata
First published:
December 15, 2018, 7:44 PM IST